హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మరో 24 గంటల్లో డొమినికా వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు రోహిత్ శర్మ సారత్యంలోని టీమిండియా సిద్దమవుతోంది.వన్డే వరల్డ్ కప్‌కు కూడా అర్హత సాధించని వెస్టిండీస్‌పై గెలుపొందడం టీమిండియాకు కష్టం కాకపోయినా.. కుర్రాళ్లతో ఉన్న ఆ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం.
అయితే గత రికార్డులను పరిశీలిస్తే మాత్రం భారత జట్టుకు విండీస్ ఏ మాత్రం పోటీ కాదు. టెస్ట్‌ల్లో గత 21 ఏళ్లుగా విండీస్ టీమ్ ఒక్క మ్యాచ్‌లో కూడా భారత జట్టును ఓడించలేకపోయింది. 2002లో జమైకా వేదికగా జరిగిన ఐదో టెస్ట్‌లో వెస్టిండీస్ చివరిసారిగా విజయం సాధించింది. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ భారత్‌పై గెలవలేకపోయింది.

ముఖా ముఖి రికార్డుల్లో మాత్రం విండీస్‌దే పై చేయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 98 టెస్టుల్లో తలపడితే.. భారత్ 22 మ్యాచ్‌లు, విండీస్ 30 మ్యాచుల్లో గెలిచింది. మిగిలిన 46 డ్రాగా ముగిశాయి.
అయితే విండీస్ సాధించిన విజయాలన్నీ 2002కు ముందు మాత్రమే. ముఖ్యంగా 1990లో ఆ జట్టుకు తిరుగు లేదు. రిచర్డ్స్, క్లైవ్‌లాయిడ్, సోబెర్స్, గ్రీనిడ్జ్, ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్ వంటి భీకరమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్న విండీస్‌తో డ్రా చేసుకుంటేనే గెలిచినంత ఆనందపడేవారు. ఆ తర్వాత చంద్రపాల్, లారా, జిమ్మీ ఆడమ్స్, కార్ల్ హోపర్, శర్వాన్, బ్రావో, గేల్, రామ్‌దిన్ వంటి ఆటగాళ్లు విండీస్ క్రికెట్ చరిత్రను కొనసాగించారు.
ఇప్పుడు మాత్రం దాదాపు కొత్తవారితోనే మళ్లీ క్రికెట్‌ను ఆడుతున్నట్లుగా విండీస్ పరిస్థితి తయారైంది. విండీస్ జట్టులో నలుగురు మాత్రమే భారత క్రికెటర్లకు పరిచయమున్న క్రికెటర్లు. వారిలో కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (85 టెస్టులు), జాసన్ హోల్డర్ (65 టెస్టులు), అల్జారీ జోసెఫ్ (28 టెస్టులు), కీమర్ రోచ్ (77 టెస్టులు) మాత్రమే ఉన్నారు. బ్లాక్‌వుడ్ కూడా 54 టెస్టులు ఆడినప్పటికీ.. భారత ఆటగాళ్లకు పెద్దగా పరిచయం లేదు.

ఇక భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్ ఆడింది తక్కువ మ్యాచ్‌లే కానీ ఫేమస్ అయిపోయాడు. అల్జారీ, కీమర్, జాసన్‌లను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలే. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడతారనేది టీమిండియా అంచనా వేయడం కష్టమే. కాబట్టి, భారత ఆటగాళ్లు తేలికగా తీసుకోకుండా కష్టపడితేనే విజయం దక్కుతుంది. లేకుంటే ఓటమి ఎదురై పరువుపోతుంది.
ఇరు జట్లు ఇవే..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్ కుమార్.
వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జోష్వా ద సిల్వా, షనోన్ గాబ్రియల్, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్ రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.