డొమినికా: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌తోనే 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్ ముంగిట టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఊరిస్తోంది.
తొలి టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. అతను ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 270 మ్యాచ్‌లు ఆడి 697 వికెట్లు తీసాడు. ప్రస్తుతం అశ్విన్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే వెస్టిండీస్‌తో తొలి టెస్టులోనే ఈ ఫీట్‌ను సాధించడం సులువే.

అశ్విన్ గనుక మూడు వికెట్లు తీస్తే భారత క్రికెట్‌లో 700 వికెట్ల ఘనత అందుకున్న మూడో బౌలర్‌గా చరిత్రకెక్కనున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున ఇద్దరు బౌలర్లు మాత్రమే 700 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. 956 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా.. హర్భజన్ సింగ్ 711 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
విండీస్ పర్యటనలో అశ్విన్ ఈ ఘనత సాధిస్తే ఈ జాబితాలో చేరుతాడు. రెండు టెస్ట్‌ల్లో అసాధారణ ప్రదర్శన కనబరిస్తే హర్భజన్ సింగ్‌ను కూడా అధిగమించనున్నాడు. మరోవైపు, టెస్టుల్లో వెస్టిండీస్‌పై అశ్విన్‌కు మంచి రికార్డ్ ఉంది. విండీస్‌తో ఇప్పటివరకు 11 టెస్టులు ఆడిన అశ్విన్ 552 పరుగులు చేయడంతో పాటు 60 వికెట్లు తీసాడు.
టెస్టు కెరీర్‌లో అశ్విన్ మొత్తం ఐదు సెంచరీలు చేయగా.. నాలుగు వెస్టిండీస్‌పైనే కావడం విశేషం. విండీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన అశ్విన్ 17 వికెట్లు పడగొట్టాడు. 7/83 అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా ఓ రికార్డు ఊరిస్తోంది. తొలి టెస్ట్ తుది జట్టులో విండీస్ ఆటగాడు త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్ వస్తే.. తండ్రీకుమారుడితో ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఫీట్ సాధిస్తాడు. పన్నెండేళ్ల కిందట తొలిసారి టెస్టుల్లోకి అడుగు పెట్టినప్పుడు విరాట్ విండీస్ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్‌తో ఆడాడు.
ఇప్పుడు త్యాగ్‌నారాయణ్‌తో కూడా కలిసి ఆడితే విరాట్ కోహ్లీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన చేరతాడు. 1992లో ఆసీస్ మాజీ ఆటగాడు జెఫ్ మార్ష్‌తో తలపడిన సచిన్.. 2011/12 సమయంలోఆయన కుమారుడు షాన్ మార్ష్‌తో కూడా ఆడటం విశేషం.