సిరాజ్ మియ్యా యార్కర్లు..
వెస్టిండీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమవ్వగా.. మహమ్మద్ సిరాజ్ బంతిని అందుకున్నాడు. క్రీజులో సెట్ అయిన రోమారియో షెఫర్డ్, అకీల హోస్సెన్ ఉన్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన విండీస్ బ్యాటర్లకు ఇది పెద్ద కష్టం కాదని అంతా భావించారు. అయితే కెప్టెన్ ధావన్ చాకచక్యంగా ఫీల్డింగ్ సెట్ చేయడంతో ఈ విండీస్ ద్వయం బౌండరీలు బాదలేకపోయింది. తొలి బంతి డాట్ కాగా.. రెండో బంతికి సింగిల్, మూడో బంతికి బౌండరీ వచ్చింది.
నాలుగో బంతికి షెఫర్డ్ 2 పరుగులు తీయగా.. ఐదో బంతిని సిరాజ్ వైడ్ వేసాడు. అది కాస్త వికెట్లకు దూరంగా వెళ్లడంతో సంజూ సూపర్ డైవ్‌తో అడ్డుకొని 4 పరుగులు సేవ్ చేశాడు. ఐదో బంతికి 2 పరుగులు రావడంతో ఆఖరి బంతికి 6 కొడితే వెస్టిండీస్ గెలిచేది. అయితే సిరాజ్ సూపర్ యార్కర్‌తో బౌండరీ ఇవ్వకుండా విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఫోర్ బాది మ్యాచ్ టైగా మారి, సూపర్ ఓవర్‌కి దారి తీసేది.
ఇది నమ్మలేకపోతున్నాం..
ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన మహమ్మద్ సిరాజ్.. విండీస్‌తో స్టన్నింగ్ యార్కర్లు వేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్‌సీబీ అభిమానులు అయితే అవాక్కవుతున్నారు. సిరాజ్ యార్కర్లు కూడా వేయగలడా? నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. సిరాజ్‌పై ఫన్నీ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్.. ఒక్క బంతిని ఆపి హీరో అయ్యాడని కామెంట్ చేస్తున్నారు. అతని వల్ల భారత్ గెలవడంతో సంజూ బ్యాటింగ్ వైఫల్యం ఎవరికీ కనబడటం లేదని సెటైర్లు పేల్చుతున్నారు.
చెలరేగిన గబ్బర్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు తీయగా.. అకీల్ హోసిన్, రొమరియో షెఫర్డ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
వణికించిన విండీస్..
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్ జట్టులో కైల్ మేయర్స్(68 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 75), బ్రాండన్ కింగ్(66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించినా.. చివర్లో అకీల్ హోసిన్(32 బంతుల్లో 2 ఫోర్లతో 32 నాటౌట్), రొమారియో షెఫర్డ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications
