ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్‌కు రెడీ అయ్యింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగే సూపర్-8 పోరులో వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పిచ్ క్యూరేటర్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ రెడీ చేసినట్లు వెల్లడించాడు.
సాధారణంగా ఈడెన్ గార్డెన్స్‌లో బౌలర్లకూ సహకారం ఉంటుంది. ఈ సారి మాత్రం ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. స్లో పిచ్‌లపై భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతుండటంతో బ్యాటింగ్ పిచ్‌ను సిద్దం చేసినట్లు సమాచారం.

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన దగ్గరుండి మరీ పిచ్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. భారత్, విండీస్ మ్యాచ్ కోసం సిద్దం చేసిన పిచ్‌పై దాదా సంతృప్తి వ్యక్తం చేశాడని పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ పేర్కొన్నారు.
చీఫ్ క్యూరేటర్ ఆశిష్ బౌమిక్‌తో కలిసి గంగూలీ పిచ్‌ను పరిశీలించారని తెలిపారు. బ్యాటర్లకు ఎక్కువ అనుకూలిస్తుందని, అదే సమయంలో లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేస్తే బౌలర్లకూ సహకారం లభిస్తుందని చెప్పారు. ఇదే వేదికగా స్కాట్లాండ్, ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 200+ స్కోర్ నమోదైంది.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. ఇక్కడ టాస్ గెలవడం అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన డ్యూ ప్రభావం ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 240+ స్కోర్ చేయాలి. ఎందుకంటే వెస్టిండీస్ జట్టులో 9వ నంబర్ బ్యాటర్ వరకూ హార్డ్ హిట్టర్లు ఉన్నారు.