
కోల్‌కతా: రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రోహిత్ సేన.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కీరన్ పోలార్డ్(24 నాటౌట్), కైల్ మేయర్స్(34) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ రవి బిష్ణోయ్(2/17), హర్షల్ పటేల్(2/37) రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 18.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 162 పరుగులు చేసి మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40)ధాటిగా ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), వెంకటేశ్ అయ్యర్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24 నాటౌట్) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు వికెట్లు తీయగా.. షెల్డన్ కాట్రెల్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు.
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. రొమారియో షెఫెర్డ్ వేసిన రెండో ఓవర్‌లో ఆఖరి బంతికి సిక్స్ బాది హిట్టింగ్ షురూ చేసిన రోహిత్ శర్మ.. ఓడియన్ స్మిత్‌కు చుక్కలు చూపించాడు. రెండేసి బౌండరీలు, సిక్సర్లతో 22 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా వరుస బౌండరీలతో దూకుడు కనబర్చడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. అయితే రోస్టన్ చేజ్ వేసిన 6వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ పూర్తిగా తడబడటంతో ఒకటే పరుగు వచ్చింది.
దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. వరుసగా రెండు ఓవర్లలో బౌండరీలు రాకపోవడంతో ఒత్తిడికి గురైన రోహిత్ శర్మ.. చేజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి విరాట్ రాగా.. ఇషాన్ నిదానంగా ఆడాడు. ఈ క్రమంలోనే చేజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఫాబియన్ బౌలింగ్‌లో కోహ్లీ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.
అయితే క్రీజులోకి వచ్చిన సూర్య.. వచ్చి రావడంతో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. రిషభ్ పంత్(8) ఔటైనా.. వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. ఇక ధోనీ తరహాలో భారీ సిక్సర్‌తో వెంకటేశ్ అయ్యార్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఇద్దరూ 28 బంతుల్లో అజేయంగా 48 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.