
అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. నలుగురు ప్లేయర్లు సహా టీమ్‌లో ఏడుగురు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఫస్ట్ వన్డే వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగినప్పటికీ.. గురువారం అహ్మదాబాద్ స్టేడియలో భారత్ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, నవ్‌దీప్ సైనీ మినహా మిగతా ప్లేయర్లకు తాజా టెస్ట్‌ల్లో నెగెటివ్ రిపోర్టు రావడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమ్ గ్రౌండ్‌లోకి వచ్చింది.
ప్లేయర్లతో పాటు కరోనా పాజిటీవ్‌గా తేలిన ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, సెక్యూరిటీ లైజన్ ఆఫిసర్ బి లోకేశ్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ మాత్రం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా వన్డే టీమ్‌లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ మూడు రోజుల క్వారంటైన్ తర్వాత టీమ్‌తో కలుస్తాడు. అలాగే స్పెషలిస్ట్ ఓపెనర్‌గా కీపర్ ఇషాన్ కిషన్‌ను కూడా టీమ్‌లోకి తీసుకున్నారు. ఈ సిరీస్‌లో తొలి వన్డే ఆదివారం జరగనుంది. వారం రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిన నేపథ్యంలో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లు ఈ సిరీస్‌కు దూరం కానున్నారు.
వెస్టిండీస్‌తో జరగనున్న ఈ వన్డే సిరీస్ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం కానుంది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా భారత్ నిలువనుంది. తొలి వన్డేతోనే టీమిండియా ఈ ఘనతను అందుకోనుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచిపోనున్నాడు. గత ఏడాది డిసెంబరులో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన భారత సెలెక్టర్లు.. రోహిత్ శర్మకి పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మకి అదే ఫస్ట్ మ్యాచ్ కావడం విశేషం.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ జట్టు కూడా 1000 వన్డేల మైలురాయిని చేరుకోలేదు. భారత్ 999 వన్డేలు ఆడి నెం.1 స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 998 వన్డేలు, పాకిస్థాన్ 936 వన్డేలతో టాప్-3లో కొనసాగుతున్నాయి.