ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. శనివారం ఏకపక్షంగా సాగిన నాలుగో టీ20లో యశస్వి జైస్వాల్(51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84 నాటౌట్), శుభ్‌మన్ గిల్(47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. షైహోప్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీసారు. అనంతరం టీమిండియా 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. వికెట్ నష్టపోయి 179 పరుగులతో సునాయసంగా గెలుపొందింది.
యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔటవ్వగా.. తిలక్ వర్మ(7 నాటౌట్) సాయంతో యశస్వీ జైస్వాల్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో రోమారియో షెఫర్డ్ ఓ వికెట్ తీసాడు.
ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమమైంది. ఆదివారం ఇదే ఫ్లోరిడా వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టును సిరీస్ వరించనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విజయాన్నందుకుంది. వరుసగా మూడు టీ20ల్లో విఫలమైన శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు.
యశస్వీ జైస్వాల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. అనంతరం అదే జోరు కనబర్చిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ముందుగా 30 బంతుల్లో శుభ్‌మన్ హాఫ్ సెంచరీ సాధించగా.. ఆ వెంటనే 33 బంతుల్లో యశస్వీ కెరీర్‌లో తొలి అర్థశతకం నమోదు చేశాడు.