డొమినికా: టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌లో 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ గడ్డపై 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా చరిత్రకెక్కారు. వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో భారత ఓపెనర్లు ఈ ఫీట్ సాధించారు.
ఇక 13 టెస్ట్‌ల తర్వాత భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం. 199 బంతుల్లో జైస్వాల్, రోహిత్ 104 పరుగులు చేయడం విశేషం. యశస్వీ జైస్వాల్ బౌండరీతో భారత్ 100 పరుగుల మార్క్ అందుకోగా.. అతను అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ కూడా అర్థశతకాన్ని నమోదు చేశాడు.

80/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత ఓపెనింగ్ జోడీ.. ఆచితూచి ఆడింది. ప్రత్యర్థి బౌలర్లను గౌరవిస్తూనే వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిచింది. అల్జారీ జోసెఫ్ వేసిన 33 ఓవర్ రెండో బంతిని యశస్వీ బౌండరీ బాది కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే ఆకాశం వైపు చూస్తూ యశస్వీ సంబరాలు చేసుకోగా.. టీమిండియా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
అల్జారీ జోసెఫ్ మరుసటి ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదిన రోహిత్ శర్మ.. రకీమ్ కార్న్‌వాల్ బౌలింగ్‌లో క్విక్ సింగిల్ తీసి 106 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో టీమిండియా స్కోర్ 121 ధాటింది. వెస్టిండీస్ చేసిన స్కోర్‌కు 29 పరుగులు మాత్రమే వెనుకంజలో ఉంది.
ఈ రోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే భారత్ స్కోర్ 400 ధాటనుంది. అదే జరిగితే ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియనుంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్.. 150 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్(5/60) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌కు తలో వికెట్ దక్కింది. విండీస్ బ్యాటర్లలో అలిక్ అతనాజే(47) మినహా అంతా విఫలమయ్యారు.