IND vs WI: చారిత్రాత్మక వన్డేలో టీమిండియాదే గెలుపు!

అహ్మదాబాద్: చారిత్రాత్మక 1000 వన్డే మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ల సూపర్ పెర్ఫామెన్స్‌కు తోడు బ్యాట్స్‌మన్ కూడా సత్తా చాటడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ (71 బంతుల్లో 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(4/49) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్(3/30) మూడు, ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు తీశారు. వీరికి తోడుగా సిరాజ్ కూడా ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ విండీస్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ హోల్డర్ ఆ జట్టు పరువును కాపాడాడు.
చెలరేగిన రోహిత్..
అనంతరం టీమిండియా 28 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీయగా.. అకీల హోస్సెన్ ఓ వికెట్ పడింది. 177 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
వరుసగా వికెట్లు కోల్పోయినా..
ఓవైపు ఇషాన్ కిషన్ నెమ్మదిగా ఆడినా మరోవైపు రోహిత్ శర్మ ధాటిగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 67 రన్స్ చేసింది. ఇక రోహిత్ శర్మ 42 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన హిట్ మ్యాన్.. జోసెఫ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ వరుస బంతుల్లో బౌండరీలు బాది జోరు కనబర్చాడు. అదే జోరులో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే ఇషాన్ కిషన్ సైతం భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ బాటపట్టాడు.

పాపం పంత్..
క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ నిలకడగా ఆడుతారని అంతా భావించగా.. దురదృష్టవశాత్తు పంత్ రనౌటయ్యాడు. సూర్య ఆడిన స్ట్రైట్ డ్రైవ్ షాట్.. బౌలర్ జోసెఫ్ కాలిని ముద్దాడుతూ వికెట్లను తాకింది. అప్పటికే నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రిషభ్ పంత్.. క్రీజు ధాటడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(34 నాటౌట్), దీపక్ హుడా(26 నాటౌట్) మరో వికెట్ పడకుండా విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications