విండీస్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి.. ఇందుకే భువీపై నమ్మకం ఉంచేది: రోహిత్ శర్మ

కోల్‌కతా: విధ్వంసకర వీరులతో కూడిన వెస్టిండీస్‌తో ఎప్పుడూ ఆడినా ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా ఆ టీమ్ సొంతమన్నాడు. వెస్టిండీస్‌తో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. వెస్టిండీస్ టీమ్‌తో పాటు తమ ఆటగాళ్లను కొనియాడాడు. ఈ మ్యాచ్ ముగింపు అసాధారణమని తెలిపాడు. ఒక్క ఫీల్డింగ్ తప్పా అన్ని విభాగాల్లో టీమిండియా సత్తా చాటిందని, ఆ ఒక్కటి కూడా సరిచేసుకుంటామని చెప్పాడు.

ఆ మాత్రం భయం ఉండాలి..
‘వెస్టిండీస్ ఆటగాళ్లతో ఎప్పుడూ ఆడినా భయంతోనే నడుచుకోవాలి. ఈ మ్యాచ్ ముగింపు అసాధారణం. ఆరంభం నుంచే ఈ మ్యాచ్‌లో గెలవడం అంత సులువైన పనికాదని మాకు తెలుసు. కానీ తీవ్ర ఒత్తిడిలో కూడా మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయడం గర్వంగా ఉంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేసే సమయానికి పరిస్థితులన్నీ చాలా క్లిష్టంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే అనుభవం పనికొస్తుంది. భువనేశ్వర్ కుమార్ గత కొన్నేళ్లుగా ఈ పాత్ర పోషిస్తున్నాడు. అందుకే అతనిపై తాము పూర్తి నమ్మకం ఉంచాం.

కోహ్లీ సూపరో సూపర్..
ఇక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అద్భుతం. అద్భుతమైన ఆరంభంతో నాపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశాడు. అతని ఆడిన ఇన్నింగ్స్ చాలా ముఖ్యమైనది. ఇక రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా ఆడి భారీ స్కోర్ అందించారు. ఇక అయ్యర్ మెచ్యురిటీ మాత్రం అద్భుతం. అతను చాలా కాన్ఫిడెన్స్‌గా కనిపించాడు. చివర్లో అవసరమైతే బౌలింగ్ చేయడానికైనా సిద్దమని చెప్పాడు. ఇక ఫీల్డింగ్‌లో మేం దారుణంగా విఫలమయ్యాం. అది చాలా తీవ్రంగా నిరాశపరిచింది. మేం వదిలేసిన క్యాచ్‌లు పట్టి ఉంటే పరిస్థితులన్నీ మాకు మరింత అనుకూలంగా మారేవి. ఈ తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

చిరస్మరణీయ విజయం..
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), రిషభ్ పంత్(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా.. రొమారియో షెఫర్డ్, షెల్డన్ కాట్రెల్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులే చేసి ఓటమి పాలైంది. నికోలస్ పూరన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62), రోమన్ పోవెల్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి పూరన్ ఔట్ చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications