బ్రిడ్జ్‌టౌన్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తనకే సాధ్యమైన ఫీల్డింగ్ విన్యాసంతో అభిమానులతో పాటు కామెంటేటర్లు, సహచర ఆటగాళ్లను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు.
జడేజా అసాధారణ క్యాచ్‌కు వెస్టిండీస్ యువ బ్యాటర్ అలిక్ అథనాజ్(22)నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జడేజా స్టన్నింగ్ క్యాచ్‌తో టీమిండియా అరంగేట్ర పేసర్ ముకేష్ కుమార్ తన వికెట్ల ఖాతా తెరిచాడు.

మహమ్మద్ సిరాజ్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ముకేష్ కుమార్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో తొలి వికెట్ సాధించాడు. ఈ ఓవర్ ఐదో బంతిని షార్ట్ పిచ్‌గా వేయగా.. అథనాజ్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాక్‌వార్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అద్భుతంగా అందుకున్నాడు.
దాంతో జడేజా పై నుంచి షాట్ ఆడాలని ప్రయత్నించి అథనాజ్ మూల్యం చెల్లించుకున్నాడు. జడేజా ఉండగా.. ఇలాంటి షాట్స్ ఆడితే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆ మరుసటి ఓవర్‌లోనే శార్దూల్ ఠాకూర్ బ్రాండన్ కింగ్(17)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు కైల్ మేయర్స్(2) హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్ చేయడంతో వెస్టిండీస్ 45 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్‌మైర్(10 బ్యాటింగ్)తో షైహోప్(24 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మెగా టోర్నీ కోసం చేస్తున్న ప్రయోగాల్లో భాగంగానే చేజింగ్ తీసుకున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు.
ఈ మ్యాచ్‌తో ముకేష్ కుమార్ వన్డేల్లోకి అరంగేట్రం చేయగా.. ఉమ్రాన్ మాలిక్ రీఎంట్రీ ఇచ్చాడు. మూడో పేసర్‌గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ జట్టులోకి రాగా.. యుజ్వేంద్ర చాహల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.