బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్పిన్నర్లు దుమ్మురేపారు. రవీంద్ర జడేజా(3/37) తీన్మార్ బౌలింగ్‌కు కుల్దీప్ యాదవ్(4/6) చార్‌మార్ తోడవ్వడంతో ఆతిథ్య వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. షైహోప్ (45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు.
భారత స్పిన్నర్లకు తోడుగా హార్దిక్ పాండ్యా, ముకేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు హార్దిక్ పాండ్యా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ కైల్ మేయర్స్(2)ను టెంప్టింగ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అలిక్ అథనాజ్(22), బ్రాండన్ కింగ్ నిదానంగా ఆడే ప్రయత్నం చేశారు.

కానీ ముకేష్ కుమార్ బౌలింగ్‌లో.. జడేజా జంపింగ్ క్యాచ్‌కు అలిక్ అథనాజ్ పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే బ్రాండన్ కింగ్(17)ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో వెస్టిండీస్ పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. అనంతరం రోహిత్ శర్మ స్పిన్నర్లను రంగంలోకి దింపగా వెస్టిండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
డేంజరస్ షిమ్రాన్ హెట్‌మైర్(11)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేసి విండీస్ పతనాన్ని ప్రారంభించాడు. మరుసటి ఓవర్లో రోవ్‌మన్ పొవెల్(4), రోమారియో షెఫెర్డ్(0)లను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు హైహోప్ నిదానంగా ఆడుతూ జట్టు స్కోర్‌ను 100 పరుగులు ధాటించే ప్రయత్నం చేశాడు.
మరోవైపు కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో డొమినిక్ డ్రేక్స్(3), యాన్నిక్ కారయ్య(3), షై హోప్(43), జయడేన్ సీలెస్(0)లను ఔట్ చేసి వెస్టిండీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. భారత స్పిన్నర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. అత్యంత దారుణంగా విఫలమై పెవిలియన్‌కు క్యూ కట్టారు. క్రీజులో నిలబడి కనీస పోటీ ఇవ్వలేకపోయారు.