డొమినికా: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో తండ్రీ కొడుకులను ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆ జట్టు ఓపెనర్ తేజ్ నారయణ్ చంద్రపాల్(12)ను క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
2011 వెస్టిండీస్ పర్యటనలో తేజ్ నారయణ్ తండ్రి, మాజీ క్రికెటర్ శివనారయణ్ చంద్రపాల్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున మరే బౌలర్ ఈ ఘనతను అందుకోలేదు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అతని కన్నా ముందు టెస్ట్ క్రికెట్‌లో ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, మిచెల్ స్టార్క్ ఈ ఫీట్ సాధించారు.

ఇయాన్ బోథమ్ ల్యాన్స్ కైర్న్స్, క్రిస్ కైర్న్స్ వికెట్లను పడగొట్టగా.. వసీం అక్రమ్ కూడా ఈ ఇద్దర్నీ ఔట్ చేశాడు. మిచెల్ స్టార్క్ శివ్ చంద్రపాల్, తేజ్‌నరైన్ చంద్రపాల్‌లను ఔట్ చేశాడు. తాజాగా అశ్విన్ ఈ జాబితాలో చేరాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు అశ్విన్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఐదో బంతికి తేజ్‌నారయణ్ చంద్రపాల్(12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ వికెట్‌తో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్ ద్వారా అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్ 95 క్లీన్ బౌల్డ్‌లు చేశాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(94) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత కపిల్ దేవ్(88), మహమ్మద్ షమీ(66)లు ఉన్నారు.
అశ్విన్ ధాటికి వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్(20) వికెట్ కూడా కోల్పోయింది. అతను వేసిన 17వ ఓవర్‌లో అశ్విన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో విండీస్ 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జెర్మైన్ బ్లాక్‌వుడ్(1 బ్యాటింగ్), రెయ్‌మన్ రీఫెర్(1 బ్యాటింగ్) పోరాడుతున్నారు.