పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్- వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు. ఇక భారత అరంగేట్ర పేసర్ ముఖేశ్ కుమార్ కెరీర్‌లో తొలి వికెట్ అందుకున్నాడు. వెస్టిండీస్ బ్యాటర్ కిర్క్ మెకెంజీ(53 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32)ని కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
శార్దూల్ ఠాకూర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ముఖేశ్ కుమార్.. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీతో అరంగేట్ర వికెట్ అందుకున్నాడు. తొలి వికెట్ అందుకున్న ముఖేశ్ కుమార్‌ను విరాట్ కోహ్లీ హగ్ ఇచ్చి అభినందించాడు. జడేజా అయితే ముఖేశ్ కుమార్ బ్యాక్‌పై కొడుతూ మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్ కోడ్ అభిమానులతో పంచుకుంది.

అయితే ఈ వికెట్ పడగానే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. మైదానాన్ని కవర్లతో కప్పి వేయగా వర్షం దంచికొడుతోంది. అటు యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. భారత్-వెస్టిండీస్ రెండో టెస్ట్‌ను కూడా వరుణ్ బ్రో వదలలేదని ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి వెస్టిండీస్ 51.4 ఓవర్లలో 2 వికెట్లకు 117 పరుగులు చేసింది. క్రీజులో క్రైగ్ బ్రాత్‌వైట్ ఉండగా.. కొత్త బ్యాటర్ రాలేదు. విండీస్ ఇంకా 321 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(80), యశస్వీ జైస్వాల్(57), రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్, కీమర్ రోచ్ మూడేసి వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీసాడు. షెన్నన్ గాబ్రియల్‌కు ఓ వికెట్ దక్కింది.