గయానా: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో టీ20లోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24), ఇషాన్ కిషన్(27), శుభ్‌మన్ గిల్(7), సూర్యకుమార్ యాదవ్(1), సంజూ శాంసన్(7) దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల హొస్సెన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫెర్డ్ రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 155 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. చివర్లో అకీల హోస్సెన్(16 నాటౌట్), అల్జారీ జోసెఫ్(10 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీసారు.
కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు టీమిండియా పతనాన్ని శాసించాయి. పవర్ ప్లేలో రవి బిష్ణోయ్‌కు బౌలింగ్ ఇవ్వడం.. చాహల్‌కు పూర్తి కోటా బౌలింగ్ ఇవ్వకపోవడం టీమిండియాను దెబ్బతీసింది. ముఖ్యంగా 18వ ఓవర్‌లో చాహల్‌కు బౌలింగ్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
153 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఓపెనర్ బ్రాండన్ కింగ్(0) పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన జాన్సన్ చార్లెస్(2) రెండు బంతుల వ్యధిలోనే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.
దాంతో వెస్టిండీస్ నాలుగు బంతుల వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఈ ఆనందం టీమిండియాకు ఎంతో సేపు లేదు. క్రీజులోకి వచ్చిన డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్, కైల్ మేయర్స్‌తో కలిసి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
కైల్ మేయర్స్(15)కు అర్ష్‌దీప్ సింగ్ కళ్లెం వేసాడు. ఎల్బీగా పెవిలియన్ చేర్చినా.. పూరన్ దూకుడు తగ్గించలేదు. ముకేష్ కుమార్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన అతను రవిబిష్ణోయ్ వేసిన ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. దాంతో విండీస్ పవరర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం కూడా పూరన్ తన జోరును కొనసాగించాడు. పోవెల్‌తో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. దాంతో విండీస్ 9 ఓవర్లలోనే 82 పరుగులు చేసింది. పూరన్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హార్దిక్ విడదీసాడు. రోవ్‌మన్ పొవెల్(21)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఆ కొద్ది సేపటికే నికోలస్ పూరన్‌ను ముకేశ్ కుమార్ ఔట్ చేయగా.. హెట్‌మైర్(22)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. దాంతో మ్యాచ్‌పై భారత్ పట్టుబిగించినట్లు అనిపించింది. కానీ ముకేష్ కుమార్ వేసిన 19వ ఓవర్‌లో అల్జారీ జోసెఫ్ సిక్సర్ బాదగా.. అకీల హోస్సెన్ బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
16వ ఓవర్ వేసిన చాహల్ జాసన్ హోల్డర్, హెట్‌మైర్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 17వ ఓవర్ వేసిన ముకేష్ 3 పరుగులే ఇచ్చాడు. 18వ ఓవర్ చాహల్‌కు ఇచ్చి.. 19వ ఓవర్ అర్ష్‌దీప్ సింగ్‌తో వేయించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.