గయానా: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్ జరుగుతున్న రెండో టీ20లోనూ సూర్యకుమార్ యాదవ్(1) విఫలమయ్యాడు. 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యకుమార్ దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. వెస్టిండీస్ ఫీల్డర్ కైల్ మేయర్స్ స్టన్నింగ్స్ త్రోకు సూర్య బలయ్యాడు.
ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన ఈ ఓవర్ మూడో బంతిని ఇషాన్ కిషన్ మిడ్‌వికెట్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కైల్ మేయర్స్ బంతిని అంతే వేగంగా అందుకొని బ్యాటింగ్ వైపు నేరుగా వికెట్లకు కొట్టాడు.

కైల్ మేయర్స్ మెరుపు త్రోకు సూర్యకుమార్ యాదవ్ డైవ్ కొట్టినా ఫలితం లేకపోయింది. దాంతో సూర్య రనౌట్‌గా వెనుదిరిగాడు. ఫీల్డర్‌ను చూసుకోకుండా పరుగుకు ప్రయత్నించడమే సూర్య కొంపముంచింది. ఈ రనౌట్ నేపథ్యంలో సూర్యపై అభిమానులు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 'పాపం సూరీడు.. రనౌట్‌కు బలయ్యాడు'అని కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం కైల్ మేయర్స్ సూపర్ ఫీల్డింగ్‌ను కొనియాడుతున్నారు. ప్రతీ మ్యాచ్‌లో కైల్ మేయర్స్.. ఫీల్డింగ్‌లో తన మార్క్ చూపిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(7) మరోసారి విఫలమయ్యాడు. ఆ వెంటనే సూర్య రనౌటవ్వడంతో భారత్ 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, ఇషాన్ కిషన్(27) జట్టును ఆదుకున్నారు. 42 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని రొమారియో షెఫర్డ్ విడదీసాడు. ఇషాన్ కిషన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే సంజూ శాంసన్ కూడా కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడంతో భారత్ 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.