వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 121 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 63/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 35.2 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు.
చివరి రోజు ఆటలో సాయి సుదర్శన్(76 బంతుల్లో 5 ఫోర్లతో 39), శుభ్‌మన్ గిల్(13) ఔటైనా.. ధ్రువ్ జురెల్(6 నాటౌట్) సాయంతో రాహుల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్‌కు 2 వికెట్లు దక్కగా.. జోమెల్ వారికన్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.

మరో 58 పరుగుల కోసం ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్‌ను రోస్టన్ ఛేజ్ ఔట్ చేయగా.. రాహుల్ 102 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ కూడా త్వరగానే ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‌కు భారీ ఆధిక్యం తగ్గింది. దాంతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. జాన్ కాంప్‌బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103) సెంచరీలతో చెలరేగగా.. జస్టిన్ గ్రీవ్స్(85 బంతుల్లో 3 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
జైడెన్స్ సీల్స్(32)తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ ఆఖరి వికెట్‌కు 79 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3/44), కుల్దీప్ యాదవ్(3/104) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌కు చెరో వికెట్ దక్కింది.