వెస్టిండీస్‌తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయిన వెస్టిండీస్‌ను ఫాలో ఆన్ ఆడించడం సరైన నిర్ణయం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తొలి ఇన్నింగ్స్ తరహాలో రెండో ఇన్నింగ్స్‌లోనూ విండీస్‌ను ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించాలని గంభీర్ రచించిన వ్యూహం బెడిసి కొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తోంది. వెస్టిండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115) సూపర్ సెంచరీతో చెలరేగగా.. షైహోప్(189 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతున్నాడు.

అతనికి తోడుగా కెప్టెన్ రోస్టన్ ఛేజ్(23 బ్యాటింగ్) అండగా నిలిచాడు. దాంతో నాలుగో రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 252/3 స్కోర్ చేసింది. ఆ జట్టు ఇంకా 18 పరుగుల వెనుకంజలో మాత్రమే ఉంది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. టర్న్ కూడా లభించడం లేదు. మరో రెండు సెషన్ల పాటు వెస్టిండీస్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తే టీమిండియా ముందు భారీ లక్ష్యం నమోదయ్యే అవకాశం ఉంది.
అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు 81.5 ఓవర్లు బౌలింగ్ చేశారు. ఇలాంటి సమయంలో విండీస్‌ను ఫాలో ఆన్ ఆడించడం ద్వారా భారత బౌలర్లు మళ్లీ బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో వారిపై అదనపు ఒత్తిడి నెలకొంది. వారు గాయాల బారిన పడే అవకాశం కూడా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ ఒక్కడే 27 ఓవర్లు బౌలింగ్ చేయగా.. జడేజా 19 ఓవర్లు వేసాడు. ఫాలో ఆన్ ఆడించకుండా టీమిండియా బ్యాటింగ్ చేసుంటే భారత బౌలర్లకు తగిన విశ్రాంతి లభించేది. అప్పుడు మరింత హుషారుగా బౌలింగ్ చేసేవారు.
కానీ గంభీర్ నిర్ణయం కారణంగా బౌలర్లతో పాటు బ్యాటర్లకు విశ్రాంతి లేకుండా పోయింది. రోజంతా ఫీల్డింగ్ చేసి బ్యాటర్లు బరిలోకి దిగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆఖరి రోజు పిచ్‌పై పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలంగా మారి బ్యాటింగ్ కష్టమయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే టీమిండియా 250+ రన్స్ టార్గెట్‌ను కూడా ఛేజ్ చేయడం కష్టంగా మారుతుంది. ఏది ఏమైనా గంభీర్ అనాలోచిత నిర్ణయం టీమిండియా కొంపముంచే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.