హైదరాబాద్: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసే దిశగా కొనసాగుతోంది. టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన వెస్టిండీస్ తొలి వన్డేలోనూ చేతులెత్తేసింది.
భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా(3/37), కుల్దీప్ యాదవ్(4/6) తీన్మార్.. చార్‌మార్ బౌలింగ్‌కు 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. 50 ఓవర్ల మ్యాచ్‌ను కాస్త టీ20 మ్యాచ్‌లా మార్చేసింది. విండీస్ బ్యాటర్లలో షై హోప్ (45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు. భారత స్పిన్నర్ల ధాటికి పోటాపడి పెవిలియన్‌కు క్యూ కట్టారు.

వెస్టిండీస్ బ్యాటర్ల వైఫల్యంపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి టీమ్‌రా అయ్యా.. కనీస పోటీ కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. వెస్టిండీస్ టీమ్ కంటే గల్లీ క్రికెట్ టీమ్ నయమని మండిపడుతున్నారు. ఇంకొందరు అయితే 'రేయ్ ఎవర్రా మీరంతా.. వన్డేను టీ20 చేసేశారు'అని విండీస్ బ్యాటర్ల ఫొటోలతో ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ ఇంత అధ్వాన్నంగా మారుతుందని ఊహించలేదని కామెంట్ చేస్తున్నారు. ప్రపంచకప్ అర్హత సాధించిన జట్టుతో సిరీస్ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో బీసీసీఐ చెప్పాలని నిలదీస్తున్నారు. వన్డే ప్రపంచకప్ ముంగిట బలమైన జట్లతో ఆడాల్సింది పోయి బలహీనమైన జట్లతో సిరీస్‌లు పెట్టడం ఎందుకని మండిపడుతున్నారు.
వెస్టిండీస్‌పై టీమిండియా తృతీయశ్రేణి జట్టు విజయం సాధిస్తుందని, ఈ సిరీస్‌కు రోహిత్ సారథ్యంలోని ప్రధాన జట్టు అక్కర్లేదని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ఆసియాకప్‌కు ఎంపిక చేసిన రుతురాజ్ గ్వైకాడ్ సారథ్యంలోని జట్టును పంపిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కొందరైతే సునీల్ గవాస్కర్ అన్నట్లు వ్యక్తిగత రికార్డుల కోసం తప్పా ఈ సిరీస్ ఎందుకు పనికిరాదని విమర్శిస్తున్నారు.
వెస్టిండీస్ ఆటగాళ్లు మరీ దారుణంగా ఆడుతున్నారని, అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లమనే విషయాన్ని మరిచిపోయారని విమర్శిస్తున్నారు. కనీసం రెండో వన్డేలోనైనా మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేయాలని కోరుతున్నారు. అసలే ఈ సిరీస్‌ను ఎవరూ చూడటం లేదంటే.. విండీస్ పేలవ ప్రదర్శన మరింత అసహనానికి గురి చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.