హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. కానీ ఈ విషయం చాలా మంది భారత అభిమానులకు తెలియదు. అవును భారత కాలమానానికి విరుద్దంగా సాగుతున్న ఈ సిరీస్‌ను ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. టైమింగ్స్‌కు తోడు తొటి టెస్ట్ పూర్తిగా ఏకపక్షంగా సాగడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
కనీసం స్కోర్ అప్‌డేట్స్ ఫాలో అయ్యేవారు కూడా పట్టించుకోవడం మానేశారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలు చేసినా.. కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ బాదినా లైట్ తీసుకున్నారు. భారత బ్యాటర్ల జిడ్డు బ్యాటింగ్‌కు విసిగిపోయారు. బజ్‌బాల్ పేరిట యాషెస్ సిరీస్‌తో టెస్ట్‌ల్లోనూ దూకుడు రుచి చూసిన అభిమానులు.. భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్ట్ తీరును జీర్ణించుకోలేకపోతున్నారు.

అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు కూడా ఈ టెస్ట్ గురించి పెద్దగా మాట్లాడటం లేదు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు మేజర్ క్రికెట్ లీగ్‌లో కామెంట్రీ చెబుతుండగా.. ఇతర మాజీలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అసలు ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లను పంపించడమే దండుగని, రికార్డులు, సెంచరీలు సాధించడానికి తప్పా ఈ పర్యటన ఎందుకు ఉపయోగపడదని ఇప్పటికే గవాస్కర్ మండిపడ్డాడు.
అతను చెప్పినట్లుగానే తొలి టెస్ట్ జరగడంతో ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. కనీసం రెండో టెస్ట్‌లోనైనా సీనియర్ ఆటగాళ్లు తప్పుకొని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కొందరు సూచిస్తున్నారు. టీమిండియా బ్యాటింగ్ చేసింది కాబట్టి మూడు రోజుల పాటు జరిగిందని, లేకుంటే రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసేదని మరికొందరు ఎటకారం చేస్తున్నారు.
వెస్టిండీస్ పర్యటనతో మజా రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన వన్డే ప్రపంచకప్ కోసం మేటి జట్లతో సిరీస్‌లు ఆడకుండా.. కనీసం వరల్డ్ కప్‌కు కూడా అర్హత సాధించని బలహీనమైన జట్టుతో సిరీస్‌లు ఏందని మరికొందరు మండిపడుతున్నారు.
యశస్వి (387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 171) సూపర్ ఇన్నింగ్స్‌కు తోడుగా రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా.. కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 421/5 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 130 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.
అశ్విన్(7/71) ఏడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, సిరాజ్ ఓ వికెట్ తీసారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 150 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే.