
కోల్‌కతా: భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ తెలిపాడు. గత రెండు మ్యాచ్‌ల్లో జట్టులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదని, కానీ ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. వాల్ష్, ఫాబియన్, డ్రేక్స్, హోప్ నలుగురు తుది జట్టులోకి వచ్చారన్నాడు. తమ జట్టు సూపర్ ఫీల్డింగ్ చేసి టీమిండియాను తక్కువ స్కోర్‌కు కట్టడి చేస్తే విజయం సాధించవచ్చన్నాడు. జట్టులోని ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశమని చెప్పాడు.
ఇక ముందుగా బ్యాటింగ్ చేయాల్సి రావడం బాగుందని, గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించామని రోహిత్ తెలిపాడు. ఈ సవాల్‌ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. ఇక తమ జట్టులో కూడా నాలుగు మార్పులు చేశామని, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్‌లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారని తెలిపాడు. వారి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌లతో పాటు ఆవేశ్ ఖాన్ అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు. ఇషాన్‌తో కలిసి రుతురాజ్ ఓపెనింగ్ చేస్తాడన్నాడు. ఇక చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్‌లకు ఎట్టకేలకు అవకాశం దక్కింది.
వన్డే సిరీస్‌లో 3-0తో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన టీమ్‌ఇండియా.. టీ20ల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే ధ్యేయంతో ఉంది. ప్రత్యర్థికి మంచి పట్టున్న పొట్టి ఫార్మాట్లో ఇప్పటికే 2-0తో సిరీస్ సొంతం చేసుకున్న భారత్.. ఈ ఆఖరి టీ20లోనూ గెలిచి వట్టిచేతులతో కరీబియన్ జట్టును ఇంటికి పంపాలని చూస్తోంది.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను వాడుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని పరీక్షిస్తోంది. మరోవైపు కనీసం ఒక్క గెలుపుతోనైనా.. స్వదేశానికి బయల్దేరాలని విండీస్ ఆరాటపడుతోంది. మరి భారత జోరుకు కళ్లెం వేయడం ఆ జట్టుకు సాధ్యమేనా? చూడాలి.
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్
వెస్టిండీస్: షై హోప్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, రొమారియో షెఫర్డ్, హెడెన్ వాల్ష్, డొమినిక్ డ్రేక్స్.