హైదరాబాద్: ముఖేష్ కుమార్.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో బాగా వినిపిస్తున్న పేరు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఈ బెంగాల్ పేసర్..వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన వన్డే, టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ పర్యటన నుంచి మహమ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు అతని స్థానంలో ముఖేష్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు.
చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ముఖేష్ కుమార్ ఎంతో కష్టపడి టీమిండియా పిలుపును అందుకున్నాడు. గతేడాదే సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో భారీ ధర పలికి ఆర్థికంగా బలపడిన ముఖేష్ కుమార్.. తన బౌలింగ్‌లో జోరు కనబరుస్తూ మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ఆడుతున్నా.. ముఖేష్ కుమార్ స్వస్థలం బిహార్‌లోని గోపాల్ గంజ్. అక్కడి యువకులంతా ఎక్కువగా సీఆర్‌పీఎఫ్, భారత ఆర్మీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. దాంతో ముఖేశ్ కుమార్‌ను కూడా భారత ఆర్మీలోకి పంపించాలని అతని కుటుంబం భావించింది. దాంతో ముఖేశ్ సీఆర్‌పీఎఫ్ ఉద్యోగం కోసం పరీక్షలు కూడా రాసాడు. కానీ క్రికెట్‌పై ఆసక్తి ఉండటంతో అతను ఉద్యోగం సాధించలేకపోయాడు.
ఇక ముఖేశ్ కుమార్ క్రికెట్ ప్రయాణం 2008-09లో మొదలైంది. పాట్నా వేదికగా జరిగిన 25 ఓవర్ల టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన ముఖేశ్ కుమార్ 34 వికెట్లతో సత్తా చాటి బీహార్ అండర్19 టీమ్‌కు ఎంపికయ్యాడు. 2012లో డిగ్రీ పూర్తి చేసుకున్న ముఖేశ్ కుమార్‌కు క్రికెట్‌పై మక్కువ ఉన్నదని తెలుసుకున్న అతని తండ్రి కోల్‌కతాకు పిలిపించాడు.
అతను కోల్‌కతా ట్యాక్సీ నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. కోల్‌కతా వచ్చిన తర్వాత అక్కడ కాళీఘాట్ క్లబ్‌లో ముఖేష్ చేరాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తండ్రికి సాయంగా ఉండేందుకు డివిజన్ లీగ్ క్రికెట్ ఆడుతూ రోజుకు 400-500 సంపాదించేవాడు. విజన్ 2020 కార్యక్రమం పేరిట బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ట్రయల్స్ ముఖేశ్ కుమార్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

బెంగాల్ టీమ్ మాజీ పేసర్, బౌలింగ్ కోచ్ రణదేబ్ బోస్.. ముఖేష్ కుమార్ బౌలింగ్ టాలెంట్‌కు ఫిదా అయ్యాడు. వెంటనే అతన్ని బెంగాల్ టీమ్‌కు ఎంపిక చేసి ఈడెన్ గార్డెన్స్‌లో ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన ముఖేశ్ కుమార్.. భారత్ ఏ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్-ఏతో సంచలన ప్రదర్శన కనబర్చి టీమిండియా పిలుపును అందుకున్నాడు.
తుది జట్టులో అవకాశం దక్కకపోయినా.. ఐపీఎల్ 2023లో రూ.5 కోట్ల భారీ ధర పలికాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చిన ముఖేశ్ కుమార్ ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. తన కల నెరవేరే సమయం ఆసన్నమైందని, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ గంగూలీకి ఎంతో రుణపడి ఉంటానని తెలిపాడు.
జూలై 12 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా.. ఆతిథ్య వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.