తరౌబా: వెస్టిండీస్ గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్ విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో భారత్‌కు చుక్కెదురైంది. అచ్చొచ్చిన ఫార్మాట్‌లో ఆతిథ్య జట్టు సత్తా చాటడంతో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(41), రోవ్‌మన్ పోవెల్(48) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచగా.. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన విండీస్ ఐదు టీ20ల సిరీస్‌లో శుభారంభం అందుకుంది. స్వల్ప లక్ష్యచేధనలోనూ టీమిండియా తడబడింది. జట్టు నిండా బిగ్ హిట్టర్లు ఉన్నా.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే పోటుగాళ్లు ఉన్నా భారత్‌కు ఓటమి తప్పలేదు.
ముఖ్యంగా భారత ఇన్నింగ్స్ 16వ ఓవర్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. జాసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. అప్పటి వరకు పటిష్టంగా కనిపించిన టీమిండియా.. ఈ ఓవర్ అనంతరం కుదేలు అయ్యింది.
ఈ ఓవర్‌కు ముందు భారత విజయసమీకరణం 30 బంతుల్లో 37 పరుగులుగా ఉంది. చేతిలో 6 వికెట్లు ఉండటంతో పాటు క్రీజులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ ఉన్నారు. చివరి వన్డేలో ఇదే మైదానంలో హాఫ్ సెంచరీలతో చెలరేగి సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. అదే జోరును కొనసాగించి టీమిండియాకు సునాయస విజయాన్ని అందిస్తారని భావించారు.
కానీ జాసన్ హోల్డర్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. తొలి బంతికే హార్దిక్ పాండ్యా(19)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. హోల్డర్ వేసిన ఆఫ్ కట్టర్‌ను హార్దిక్ ముందుకు వచ్చి లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను తాకేసింది.
అనంతరం క్రీజులోకి అక్షర్ పటేల్ రాగా.. మూడో బంతికి నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న సంజూ శాంసన్(12) రనౌటయ్యాడు. లేని పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నారు. మూడు బంతుల్లో రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయింది. దాంతో ఈ ఓవర్ మెయిడిన్ అయ్యింది. అనంతరం వేగంగా పరుగులు చేయాలనే ఆతృతలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.