టీ20 ప్రపంచకప్ 2024లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించింది. బ్యాటింగ్‌కు ప్రతీకూలం ఉన్న వికెట్‌పై తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వణికించింది. చివరకు ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైనా.. తమ ఆటతీరుతో ఆకట్టుకుంది.
అయితే ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన స్టాప్ క్లాక్ రూల్ అమెరికా కొంపముంచింది. ఈ రూల్‌ను అతి క్రమించిన అమెరికాకు అంపైర్లు 5 పరుగులు పెనాల్టీ విధించారు. దాంతో టీమిండియా ఖాతాలో ఐదు రన్స్ అప్పనంగా చేరాయి.

స్టాప్ క్లాక్ రూల్ అంటే..?
మ్యాచ్‌లను సకాలంలో పూర్తి చేయడం కోసం ఐసీసీ ఈ స్టాప్ క్లాక్ రూల్‌ను తీసుకొచ్చింది. ఈ నియమం ప్రకారం ఫీల్డింగ్ జట్టు ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపు తదుపరి ఓవర్‌ను ప్రారంభించాలి. ఒకే ఇన్నింగ్స్‌లో ఇలా మూడు సార్లు 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ ప్రారంభించకపోతే 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు. ఈ సమయాన్ని థర్డ్ అంపైర్ స్టాప్ క్లాక్ సాయంతో లెక్కిస్తారు.
భారత్‌తో మ్యాచ్‌లో అమెరికా బౌలర్లు మూడు సార్లు 60 సెకన్లలోపు మరో ఓవర్‌ను ప్రారంభించలేదు. అప్పటికే రెండు సార్లు హెచ్చరించిన అంపైర్.. మూడో సారి రూల్స్ ప్రకారం 5 రన్స్ పెనాల్టీగా విధించాడు. అప్పనంగా వచ్చిన ఈ ఐదు పరుగులు టీమిండియా ఒత్తిడిని తగ్గించాయి.
30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ఈ 5 రన్స్ లభించడం భారత బ్యాటర్లు స్వేచ్చగా ఆడేలా చేసింది. ఈ 5 పరుగులతో పాటు 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను సౌరభ్ నేత్రవల్కర్ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టినా.. పెనాల్టీ 5 పరుగులు ఇవ్వకపోయినా ఫలితం మరోలా ఉండేది.
నిప్పులు చెరిగిన అర్ష్‌దీప్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27), స్టీవెన్ టేలర్(30 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/14) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్(1/25)కు ఓ వికెట్ దక్కింది.
సూర్య హాఫ్ సెంచరీ
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. సూర్య(49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీకి తోడుగా శివమ్ దూబే(35 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31) రాణించారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్(2/18) రెండు వికెట్లు తీయగా.. అలీ ఖాన్(1/21) ఓ వికెట్ తీసాడు. ఈ గెలుపుతో టీమిండియా సూపర్ -8కు అర్హత సాధించింది.