For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs USA: అమెరికా కొంపముంచిన క్యాచ్ డ్రాప్.. సూపర్-8కు టీమిండియా!

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. అమెరికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27), స్టీవెన్ టేలర్(30 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/14) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్(1/25)కు ఓ వికెట్ దక్కింది.

SKY Arshdeep guide

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. సూర్య హాఫ్ సెంచరీకి తోడుగా శివమ్ దూబే(35 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31 నాటౌట్) రాణించాడు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రవల్కర్(2/18) రెండు వికెట్లు తీయగా.. అలీ ఖాన్(1/21) ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో టీమిండియా సూపర్ -8కు అర్హత సాధించింది.

సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను సౌరభ్ నేత్రవల్కర్ నేలపాలు చేయడం, కీలక సమయంలో పెనాల్టీ రూపంలో 5 పరుగులు సమర్పించుకోవడం అమెరికా విజయావకాశాలను దెబ్బతీసింది.

కోహ్లీ గోల్డెన్ డక్..
111 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సౌరభ్ నేత్రవల్కర్ వేసిన తొలి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి కీపర్ క్యాచ్‌‌గా ఔటయ్యాడు. నేత్రవల్కర్ మరుసటి ఓవర్‌లో కెప్టెన్ రోహిత్(3) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో రిషభ్ పంత్(18), సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 33 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న రిషభ్ పంత్‌(18)ను అలీ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో శివమ్ దూబే క్రీజులోకి రాగా.. సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడాడు.

కొంపముంచిన నేత్రావల్కర్..
ఇక అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను సౌరభ్ నేత్రావల్కర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సూర్యకుమార్ యాదవ్.. శివమ్ దూబేతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తీవ్రంగా ఇబ్బంది పడిన శివమ్ దూబే.. కోరే అండర్సన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది టచ్‌లోకి వచ్చాడు.ఈ షాట్ అనంతరం అతను స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు.

అయితే 15వ ఓవర్ తర్వాత టీమిండియాకు పెనాల్టీ రూపంలో 5 పరుగులు కలిసొచ్చాయి. ఓవర్ పూర్తయిన అనంతరం అమెరికా బౌలర్లు 60 సెకండ్స్‌లోపు మరో ఓవర్‌ను ప్రారంభించలేదు. ఇలా మూడు సార్లు చేయడంతో అంపైర్లు రూల్స్ ప్రకారం 5 పరుగుల పెనాల్టీ విధించారు. దాంతో టీమిండియాకు అప్పనంగా 5 పరుగులు లభించాయి.

సూర్య@50
ఈ రన్స్‌తో భారత బ్యాటర్లు ఊపిరి పీల్చుకున్నారు. వాన్ స్కాల్విక్ వేసిన 16వ ఓవర్‌లో సూర్య ఓ సిక్స్, బౌండరీ బాది ఒత్తిడిని తగ్గించాడు. అలీఖాన్ వేసిన 19వ ఓవర్‌లో సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. శివమ్ దూబే క్విక్ డబుల్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Wednesday, June 12, 2024, 23:42 [IST]
Other articles published on Jun 12, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+