సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేల అసాధారణ బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27), స్టీవెన్ టేలర్(30 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/14) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్(1/25)కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. సూర్య హాఫ్ సెంచరీకి తోడుగా శివమ్ దూబే(35 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31) రాణించారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్(2/18) రెండు వికెట్లు తీయగా.. అలీ ఖాన్(1/21) ఓ వికెట్ తీసాడు. ఈ గెలుపుతో టీమిండియా సూపర్ -8కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు అమెరికా జట్టులోని భారత సంతతి ఆటగాళ్లపై ప్రశంసంల జల్లు కురిపించాడు. 'ఇది కఠినమైన లక్ష్యమని తెలుసు. మేం పరిస్థితులకు తగ్గట్లు ఓపికగా బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకున్నాం. ముఖ్యంగా శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్‌లు ఎంతో పరిణితితో బ్యాటింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే.
అమెరికా జట్టులోని భారత క్రికెటర్లలో చాలా మంది మాతో కలిసి ఆడినవారే. వారి పురోగతి చాలా సంతోషాన్నిచ్చింది. MLC టోర్నీలో కూడా వాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ మ్యాచ్‌లో బౌలర్లదే పై చేయి అవుతుందని తెలుసు. ఈ వికెట్‌పై పరుగులు చేయడం చాలా కష్టం. మా బౌలర్లంతా అద్భుతంగా బౌలింగ్ చేశారు.
ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. టైమ్ వచ్చినప్పుడు దూబేను బౌలింగ్ ఆప్షన్‌గా వాడుకుంటాను. ఈ రోజు పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. దాంతో వారితోనే ఎక్కువగా బౌలింగ్ చేయించాను. సూపర్ 8కు అర్హత సాధించడం సంతోషంగా ఉంది.
ఇది మాకు బిగ్ రిలీఫ్. ఇక్కడ క్రికెట్ ఆడటం అంతా సులువైన పనికాదు. కానీ మేం ఇక్కడ మూడు మ్యాచ్‌లు గెలిచాం. సూర్య తనదైన శైలిలో చెలరేగాడు.అనుభవజ్ఞులైన ఆటగాళ్ల నుండి మీరు ఆశించేది అదే. గేమ్‌ను చివరి వరకు తీసుకెళ్లి గెలవడానికి ప్రయత్నించాలి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.