
బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని అమెరికా తాత్కలిక కెప్టెన్ ఆరోన్ జోన్స్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో యూఎస్‌ఏ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఆరోన్ జోన్స్.. బ్యాటింగ్‌లో మరో 10-15 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.
'మేం మా లక్ష్యానికి 10-15 పరుగులు తక్కువగా చేశాం. మేమే గనుక 130 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. పోరాడటానికి ఆస్కారం ఉండేది. కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు రావడం సాధారణమే. ఈ మ్యాచ్‌లో ఓడినా మా కుర్రాళ్లు తల ఎత్తుకునే ప్రదర్శన కనబర్చారు. మా ఆటగాళ్లు చాలా క్రమ శిక్షణతో ఆడారు. ముఖ్యంగా మా బౌలింగ్ యూనిట్ పట్ల గర్వంగా ఉంది.

మేం కోరుకున్న విధంగా మా ప్రదర్శన ఉండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. యూఎస్‌ఏ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాం. కొన్ని సమావేశాల తర్వాత మా తప్పిదాలను తెలుసుకొని మరింత పుంజుకుంటాం. ఈ వికెట్ చాలా కష్టంగా ఉంది. సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. అందుకే నేను స్పిన్నర్లతో బౌలింగ్ చేయంచలేదు. మా కెప్టెన్ మోనాంక్ పటేల్ తదుపరి మ్యాచ్‌కు అదుబాటులోకి వస్తాడు. అతనికి చాలా చిన్న గాయం అయ్యింది.'అని ఆరోన్ జోన్స్ చెప్పుకొచ్చాడు.
ఫిట్‌నెస్ సమస్యలతో భారత్‌తో మ్యాచ్‌కు అమెరికా రెగ్యులర్ కెప్టెన్ మోనాంక్ పటేల్ దూరమయ్యాడు. దాంతో ఆరోన్ జోన్స్ తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27), స్టీవెన్ టేలర్(30 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/14) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్(1/25)కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. సూర్య హాఫ్ సెంచరీకి తోడుగా శివమ్ దూబే(35 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31) రాణించారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్(2/18) రెండు వికెట్లు తీయగా.. అలీ ఖాన్(1/21) ఓ వికెట్ తీసాడు. ఈ గెలుపుతో టీమిండియా సూపర్ -8కు అర్హత సాధించింది.
సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను సౌరభ్ నేత్రవల్కర్ నేలపాలు చేయడం, కీలక సమయంలో పెనాల్టీ రూపంలో 5 పరుగులు ఇచ్చుకోవడం అమెరికా విజయావకాశాలను దెబ్బతీసింది.