కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. మంగళవారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 42 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఇరు జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య ఉన్న బంధం అభిమానులను ఆకట్టుకుంది. వికెట్ పడిన ప్రతీసారి ఈ ఇద్దరూ ఒకరినొకరు హత్తుకోవడం.. ఇద్దరూ చర్చించుకొని కీలక నిర్ణయాలు తీసుకోవడం కనిపించింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు.

శ్రీలంక కెప్టెన్ డసన్ షనక క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా అందుకోవడంతో కోహ్లీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రోహిత్ శర్మను మనసారా హత్తుకున్నాడు. అంతకు ముందు విక్రమార్క స్టంపౌట్ అయిన సమయంలో కోహ్లీ ఇలానే రోహిత్‌ను హత్తుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గతేడాది వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విబేధాలున్నట్లు వార్తలు వచ్చాయి. మైదానంలో వారి ప్రవర్తన కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. కానీ టీ20 ప్రపంచకప్ 2022 నుంచి ఈ ఇద్దరూ చాలా స్నేహంగా కనిపిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. ప్రతీ ఒక్క ఆటగాడు సత్తా చాటుతున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్(26, సిరాజ్(5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (4/14) నాలుగు వికెట్లు తీసాడు. మహీశ్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది.అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా( 66 బంతుల్లో 5 ఫోర్లతో 41), దునిత్ వెల్లలాగే(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.