స్టార్ ఆటగాళ్లు లేకుండా చప్పగా సాగుతున్నా టీమిండియా.. శ్రీలంక పర్యటనకు ఊపు తీసుకొచ్చేందుకు కింగ్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ రెడీ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం లంక గడ్డపై అడుగుపెట్టారు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విశ్రాంతి తీసుకున్న ఈ స్టార్ ఆటగాళ్లు.. రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే రోజు టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో విజయాన్నందుకున్న టీమిండియా 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ఈ విజయానంతరం రోహిత్ శర్మ కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లగా.. విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో లండన్‌లో గడిపాడు.

టీ20 ప్రపంచకప్ విజయంతో ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. సోమవారమే లంకకు చేరిన కోహ్లీ, రోహిత్.. ఈ సాయంత్రం నుంచే ప్రాక్టీస్ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ, రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు కూడా పాల్గొననున్నారు.
నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఈ స్టార్ ఆటగాళ్లు ఎలా ఆడుతారు? వారిని అతను ఎలా ట్రీట్ చేస్తాడు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు శ్రీలంకపై మంచి రికార్డ్ ఉంది. రోహిత్.. శ్రీలంకపై రెండు డబుల్ సెంచరీలు బాదగా.. కోహ్లీ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. పైగా కోహ్లీ బ్యాటింగ్ శైలికి వన్డే ఫార్మాట్ సరిగ్గా సరిపోతుంది.
సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తుంటం.. అచ్చొచ్చిన ఫార్మాట్‌లో బరిలోకి దిగుతుండటంతో సెంచరీల మోత మోగిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సిరీస్‌తోనే టీమిండియా ఛాంపియన్స్ 2025 ట్రోఫీ సన్నాహకాలు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే.
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో శుక్రవారం (ఆగస్టు 2) తొలి వన్డే, ఆదివారం(ఆగస్ట్ 4) రెండో వన్డే, ఆగస్ట్ 7(బుధవారం) మూడో వన్డే జరగనుంది.