భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బౌలర్, వికెట్ కీపర్, ఫీల్డర్ ఎవరూ అప్పీల్ చేయకున్నా అంపైర్ ఔటివ్వడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఆదివారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్ పాతుమ్ నిస్సంక అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రవి బిష్ణోయ్ వేసిన 10వ ఓవర్‌లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ఈ వికెట్ కోసం రవి బిష్ణోయ్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో పాటు మరే ఫీల్డర్ అప్పీల్ చేయలేదు.

బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయినట్లు అనిపించడంతో వారు అప్పీల్ చేయకుండా మౌనంగా ఉన్నారు. కానీ అంపైర్ మాత్రం ఔట్ అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇది చూసి బిష్ణోయ్ బిత్తర పోయాడు. రీప్లేలో బంతి ప్యాడ్‌ను తాకిన తర్వాత బ్యాట్‌ను తాకినట్లు తేలింది. దాంతో పాతుమ్ నిస్సంక నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. పాతుమ్ నిస్సంక(24 బంతుల్లో 5 ఫోర్లతో 32) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(3/26) మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్(2/24), అక్షర్ పటేల్(2/30), హార్దిక్ పాండ్యా(2/23) రెండేసి వికెట్లు తీసారు.
భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే వర్షం రావడంతో ఆటకు గంటన్నరపాటు అంతరాయం కలిగింది. తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. అంపైర్లు భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. టీమిండియా 6.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 81 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), సూర్యకుమార్ యాదవ్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26), హార్దిక్ పాండ్యా(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) రాణించారు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ, వానిందు హసరంగా, మహీష్ పతీరణ తలో వికెట్ తీసారు.