మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. అటాకింగ్ గేమ్‌తో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు.
సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), శుభ్‌మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) ధాటిగా ఆడారు.

శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, అసిత ఫెర్నాండో, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ.. వేగంగా పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ తన శైలికి భిన్నంగా వరుస బౌండరీలతో దూకుడు కనబర్చాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మదుషంక విడదీసాడు.
ఊరించే బంతితో శుభ్‌మన్ గిల్‌ను క్యాచ్ ఔట్‌గా బోల్తాకొట్టించాడు. ఆ మరుసటి బంతికే హసరంగా.. యశస్వి జైస్వాల్‌ను స్టంపౌట్ చేశాడు. దాంతో 74 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ అదే జోరును కొనసాగించారు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయినా అటాకింగ్ గేమ్ ఆడారు.
సూర్య తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అలరించాడు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య.. పతీరణ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(9), రియాన్ పరాగ్(7) తీవ్రంగా నిరాశపర్చగా.. రిషభ్ పంత్ దూకుడుగా ఆడి జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్క్‌ను ధాటించాడు. అయితే పతీరణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగు దూరంలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్(1) కూడా విఫలమవ్వగా.. అక్షర్ పటేల్ భారీ సిక్సర్‌తో భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు.