టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఫస్ట్ సిరీస్‌లోనే విజయాన్ని అందుకున్నాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకొని తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడంతో సెలెక్టర్లు సూర్యను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2024లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను తప్పించి మరీ సూర్యకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా యువ ప్లేయర్ శుభమన్ గిల్‌ను ఎంపిక చేశారు. ఈ నిర్ణయాల వెనుక నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. అతని సూచనలతో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సూర్యను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు.

2026 టీ20 ప్రపంచకప్ వరకు అతనే సారథిగా కొనసాగుతాడని, టీ20లు మాత్రమే ఆడుతాడని కూడా స్పష్టం చేశాడు. భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దేందుకే శుభ్‌మన్ గిల్‌ను మూడు ఫార్మాట్లలో వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశామని కూడా అగార్కర్ వివరణ ఇచ్చాడు.
టీమిండియా కొత్త సారథి నియామకంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ తాత్కలిక కెప్టెన్ అని, శుభ్‌మన్ గిల్ కోసం అతన్ని సారథిగా ఎంపిక చేశారని చెప్పాడు. మరో రెండేళ్ల పాటే సూర్య సారథిగా కొనసాగుతాడని, ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడని చెప్పాడు.
'సూర్య ఏడాది లేదా రెండేళ్ల వరకే టీ20 కెప్టెన్‌గా కొనసాగుతాడు. శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్ చేయడానికి అతన్ని ఓ వారధిలా ఉపయోగిస్తున్నారు. సూర్య తాత్కలిక కెప్టెన్. శుభ్‌మన్ గిల్‌కు అనుభవం వచ్చే వరకు మాత్రమే అతను కెప్టెన్‌గా కొనసాగుతాడు'అని స్టైరిస్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటరాక్షన్‌లో చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలకు సూర్యకుమార్ యాదవ్ తన ఆటతోనే బదులిచ్చాడు. తాను తాత్కలిక సారథిని కాదని, పూర్తిస్థాయి కెప్టెన్ అని విజయంతో గర్జించాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకొని కెప్టెన్‌గా తన తొలి అడుగును బలంగా వేసాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ సూర్య.. కెప్టెన్‌గా కాకుండా బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సూర్య.. రెండో మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో విలువైన పరుగులు చేశాడు.
అంతకుముందు రోహిత్, హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో తాత్కలిక సారథిగా సూర్య.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లను గెలిచాడు. కెప్టెన్‌గా ఇప్పటి వరకు ఆడిన మూడు సిరీస్‌ల్లో అతను విజయం సాధించాడు.