మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఒకే ఓవర్‌లో రైట్‌హ్యాండ్ బ్యాటర్‌కు లెఫ్టార్మ్ బౌలింగ్ చేసిన కమిందు మెండిస్.. లెఫ్టార్మ్ బ్యాటర్‌కు రైట్ హ్యాండ్ బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం అతని బౌలింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలింగ్ చేసిన కమిందు మెండిస్.. అదే ఓవర్‌లో లెఫ్మార్మ్ బ్యాటర్ అయిన రిషభ్ పంత్‌కు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేశాడు. దీంతో కమిందు మెండిస్‌ను యాంబిడెక్ట్సెరిటీ బౌలర్ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు 'ఇదేందయ్యా ఇది.. మేం ఏడ చూడలే'అని ఫన్నీగా స్పందిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. అటాకింగ్ గేమ్‌తో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది.
రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), శుభ్‌మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) ధాటిగా ఆడారు. శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, అసిత ఫెర్నాండో, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79), కుశాల్ మెండీస్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 45) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో రియాన్ పరాగ్(3/5) మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసారు. రెండో టీ20 ఆదివారమే జరగనుంది.