
కొలంబో: భారత్‌పై అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక అద్భుత విజయాన్నందుకుంది. గురువారం జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలుచుకొని వన్డే సిరీస్‌కు బదులు తీర్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 రన్స్ మాత్రమే చేసింది. కుల్దీప్ యాదవ్(28 బంతుల్లో 23 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాప్-5 బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్(0), దేవదత్ పడిక్కల్(9), సంజూ శాంసన్(0), రుతురాజ్ గైక్వాడ్(14), నితీశ్ రాణా(6) దారుణంగా విఫలమయ్యారు. బర్త్‌డే బాయ్ వానిందు హసరంగ(4/9) 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా డసన్ షనక రెండు వికెట్లు తీశాడు. రమేశ్ మెండీస్, దుష్మంత చమీరా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూ పాడుతూ 14.3 ఓవర్లలో మూడు వికెట్లకు 82 రన్స్ చేసి విజయాన్నందుకుంది. రాహుల్ చాహర్(3/15) మూడు వికెట్లతో రాణించినా మిగతా బౌలర్లు రాణించలేకపోయారు. ధనుంజయ డిసిల్వా(19 బంతుల్లో 2 ఫోర్లు 23 నాటౌట్) మరోసారి కడవరకు నిలిచి విజయాన్నందించాడు. అతనికి అండగా వానిందు హసరంగా(14 నాటౌట్) నిలిచాడు. అవిష్కా ఫెర్నాండో(12), మినోద్ భానుక(18) విఫలమయ్యారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ రచించిన ప్లాన్ మిస్‌ఫైర్ అయింది. జట్టులో ఒక బ్యాట్స్‌మన్ కొరత ఉండటంతో ఛేజింగ్‌కు ఇబ్బందవుతుందని భావించిన భారత్.. సాధారణ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచి బౌలింగ్ బలంతో దెబ్బతీయాలనుకుంది. కానీ శ్రీలంక బౌలర్ల ముందు ఈ వ్యూహం బెడిసికొట్టింది. ఇక కరోనా కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమవడంతో టీమిండియా బలహీనమైంది. ధావన్ బౌలింగ్ మార్పులు కూడా కలిసి రాలేదు.