టీమిండియా యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ హెచ్చరించాడు. నిలకడగా రాణించకపోతే జట్టులో చోటు గల్లంతవుతుందన్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్(16) విఫలమయ్యాడు. 35 బంతులాడి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన సల్మాన్ బట్.. అతను నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోకపోతే.. వన్డే జట్టులో కొనసాగడం కష్టమని చెప్పాడు. శుభ్‌మన్ గిల్ తరుచుగా 20-30ల్లో ఔటవుతున్నాడని, బంతిని గాల్లోకి కొట్టి క్యాచ్ ఔట్‌గా వెనుదిరుగుతున్నాడని తెలిపాడు.

'గత ఏడాదిన్నరగా శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. వరల్డ్ బెస్ట్ అత్యుత్తమ బ్యాటర్లతో సమంగా నిలకడగా రాణించాడు. అయితే వన్డే ప్రపంచకప్ తర్వాత అతను దారుణంగా విఫలమవుతున్నాడు. సరైన శుభారంభాలు అందించలేకపోతున్నాడు.
అతను 20-25 పరుగులే చేసి ఔటవుతున్నాడు. చాలా బంతులను గాల్లోకి ఆడుతూ సర్కిల్ లోపలే క్యాచ్ ఔట్ అవుతున్నాడు. అప్పిష్ డ్రైవ్స్ ఆడబోయి పాయింట్‌లో క్యాచ్ ఇస్తున్నాడు. ఏకాగ్రతను త్వరగా కోల్పోతున్నాడు. 20-30 పరుగులే చేస్తున్నాడు. ఇది అతనికి దయనీయమైన దశ.'అని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు శుభ్‌మన్ గిల్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ తమ భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. శుభ్‌మన్ గిల్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌గా తీర్చిదిద్దేందుకే మూడు ఫార్మాట్లలో వైస్ కెప్టెన్‌గా నియమించామని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. శ్రీలంకతో పర్యటనకే ముందే శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు ఇవ్వగా.. వన్డే, టెస్ట్‌ల్లో రోహిత్ సారథిగా కొనసాగనున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్యనే టీ20 కెప్టెన్ అని స్పష్టం చేసింది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని అందుకోలేకపోయింది. రెండు వికెట్లను చేతిలో పెట్టుకొని విజయానికి కావాల్సిన ఒక్క పరుగు చేయలేకపోయింది. శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ వరుస బంతుల్లో ఔటవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. అనంతరం భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.
రోహిత్ శర్మ ( 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ ( 57 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్ ( 43 బంతుల్లో, 2 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) మూడేసి వికెట్లు తీయగా.. వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటాడు.