టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. మళ్లీ బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి వన్డేతో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పునరాగమనం చేయనున్నారు.
ఈ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుది జట్టు ఎంపిక.. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లో ఒకరిని ఎంచుకోవడం కష్టమని రోహిత్ తెలిపాడు.

ఒక్కరే అంటే కష్టం..
'కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ల్లో ఒకర్ని ఎంచుకోవడం కష్టం. ఎందుకంటే ఇద్దరూ మ్యాచ్ విన్నర్లే. ఆటలో ఎవరికి వారే సాటి. అయితే ఇది సంతోషించదగిన విషయమే. నేను ఇలాంటి సమస్యలనే కోరుకుంటున్నాను. జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడే ఆశించిన ఫలితాలు దక్కుతాయి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
టీమిండియా ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగిన రిషభ్ పంత్.. రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమవ్వడంతో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా కొనసాగాడు. ఐపీఎల్‌తో పంత్ రీఎంట్రీ ఇవ్వడంతో టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. వన్డేల్లో మిడిలార్డర్‌లో ఆడగలిగే సామర్థ్యం ఉన్న కేఎల్ రాహుల్‌కే ప్రధాన వికెట్ కీపర్‌గా టీమిండియామేనేజ్‌మెంట్ అవకాశాలు ఇచ్చింది.
పంత్ అందుబాటులోకి రావడంతో పాటు గంభీర్ సారథ్యంలోని కొత్త మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని రోహిత్‌ను అడగ్గా.. అతను క్లారిటీ ఇవ్వలేదు.
గంభీర్‌కు అనుభవం ఎక్కువ..
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుతూ.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'గౌతమ్ గంభీర్ చాలా క్రికెట్ ఆడాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా పనిచేశాడు. అతనితో కలిసి మేం క్రికెట్ కూడా ఆడాం. కొత్త కోచింగ్ సెటప్‌తో ఎప్పుడైనా డెస్సెంగ్ రూమ్‌లో విభిన్నమైన వాతావారణం ఉంటుంది.'అని రోహిత్ తెలిపాడు.
గౌతమ్ గంభీర్ నవ్వు గురించి ప్రశ్నించిన ఓ జర్నలిస్ట్‌కు రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. విమల్ కుమార్ అనే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్.. 'జట్టును విడిచి వెళ్లేటప్పుడు రాహుల్ ద్రవిడ్ భావోద్వేగానికి గురయ్యాడు. కోచ్‌గా ఎన్నో ఎమోషన్స్ చూపించాడు. ఇప్పుడు అతని స్థానంలో గంభీర్ వచ్చాడు. అతను ఇప్పుడైనా నవ్వుతాడా? రానున్న రోజుల్లో ద్రవిడ్‌లా భావోద్వేగాలు చూపిస్తాడా?'అని ప్రశ్నించాడు.
నవ్వడం.. ఆయన వ్యక్తిగతం..
ఇందుకు రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నవ్వడం, నవ్వకపోవడం.. భావోద్వేగాలను చూపించడం అనేది గౌతమ్ గంభీర్ వ్యక్తిగతం. నువ్వు చాలా నవ్వుతున్నావ్.. కానీ చాలా మందికి అది నచ్చడం లేదు.'అని పేర్కొన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.