కొలంబో: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 10 వేల పరుగుల మైలు రాయి అందుకున్నాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్‌కు దిగగా.. కాసున రజితా వేసిన ఏడో ఓవర్ ఐదో బంతిని రోహిత్ భారీ సిక్సర్‌గా మలిచి 10 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.
అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగుల మైలు రాయి అందుకోగా.. రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌లు, సచిన్ టెండూల్కర్(259), సౌరవ్ గంగూలీ(263), రికీ పాంటింగ్(266) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలిచాడు.

వన్డే క్రికెట్‌లో మొత్తం 15 మంది 10 వేలు పరుగుల మైలు రాయి అందుకోగా.. బెస్ట్ యావరేజ్ విషయంలో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. 57.62 సగటుతో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉండగా 50.57 సగటుతో ధోనీ.. రోహిత్(49.02) కన్నా ముందున్నాడు.
అనంతరం మరింత ధాటిగా ఆడిన రోహిత్.. డసన్ షనక వేసిన 10వ ఓవర్లో నాలుగు బౌండరీలు బాది 17 పరుగులు పిండుకున్నాడు. ఆ మరుసటి ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన రోహిత్.. గిల్ ఔటైనా పతీరణ బౌలింగ్‌లో బౌండరీ బాది 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ప్రస్తుత ఆసియాకప్‌లో రోహిత్ శర్మకు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్‌లో విఫలమైన రోహిత్.. ఆ తర్వాత నేపాల్, పాకిస్థాన్, శ్రీలకంతో జరిగిన మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదాడు. విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ వన్డేలో అత్యంత వేగంగా 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా చరిత్రకెక్కింది.
శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లెలగే రోహిత్ శర్మ(53)తో పాటు శుభ్‌మన్ గిల్(19), విరాట్ కోహ్లీలను పెవిలియన్ చేర్చాడు.
ముందుగా శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ దునిల్ వెల్లెగే బౌలింగ్‌లో క్యాచ్ ఔటవ్వగా.. రోహిత్ శర్మను అతనే క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో టీమిండియా 11 పరుగుల వ్యవధిలోనే కీలకంగా మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ పోరాడుతున్నారు.