టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(37 బంతుల్లో 3 ఫోర్లతో 39) మరోసారి క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు నెమ్మదిగా ఆడి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది.
శుభ్‌మన్ గిల్‌తో పాటు రియాన్ పరాగ్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 26), వాషింగ్టన్ సుందర్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(2/29) రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ(3/28) మూడు వికెట్లు పడగొట్టాడు. చామిందు విక్రమిసంఘే, అసితా ఫెర్నాండో, రమేష్ మెండీస్ తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై శ్రీలంక బౌలర్లు నిప్పులు చెరగడంతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. యశస్వి జైస్వాల్(10), సంజూ శాంసన్(0), రింకూ సింగ్(1), సూర్యకుమార్ యాదవ్(8), శివమ్ దూబే(13) దారుణంగా విఫలమయ్యారు.
ఈ పరిస్థితుల్లో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రియాన్ పరాగ్ పిచ్‌కు తగ్గట్లు ఆచితూచి ఆడి జట్టును ఆదుకున్నారు. పూర్తిగా టెస్ట్ బుక్ షాట్స్‌కు పరిమితమైన శుభ్‌మన్ గిల్.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. క్రీజులో సెట్ అయిన అతన్ని హసరంగా స్టంపౌట్ చేశాడు. దాంతో6 వికెట్‌కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ భాగస్వామ్యమే లేకుంటే భారత్ 100 పరుగుల్లోపే కుప్పకూలేది.
ఆ కొద్ది సేపటికే రియాన్ పరాగ్ కూడా ఔటవ్వగా.. వాషింగ్టన్ సుందర్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్‌లో దూకుడుగా ఆడే క్రమంలో అతను ఔటవ్వగా.. మహమ్మద్ సిరాజ్ రనౌటయ్యాడు.