
మొహాలీ: టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రిషభ్ పంత్(97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96) శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ(45), హనుమ విహారి(58) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిర రిషభ్ పంత్.. శ్రేయస్ అయ్యర్(27)తో 53 పరుగులు జోడించాడు. శ్రేయస్ అయ్యర్ ఔటైనా.. రవీంద్ర జడేజాతో కలిసి జట్టు స్కోర్‌ను పరుగెత్తించాడు.
తనదైన సింగిల్ హ్యాండ్ షాట్లతో బౌలర్లను చితక్కొట్టాడు. ఆరంభంలో కొంత సమయం తీసుకున్న పంత్ 73 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పంత్ విధ్వంసంతో సెంచరీ పక్కా అని అంతా భావించారు. కానీ సురంగ లక్మల్.. ఈ భారత వికెట్ కీపర్ జోరుకు కళ్లెం వేసాడు. సూపర్బ్ డెలివరీతో పంత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రిషభ్ పంత్ తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు. అసలు తాను ఔటయ్యనా? అనే సందేహంతో అత్యంత నెమ్మదిగా క్రీజును వీడాడు.
ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ఆటగాళ్లు, కోచ్‌లు కూడా పంత్ ఔటవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అభిమానులు అయితే పాపం పంత్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేజారితే కలిగే ఆ బాధ వర్ణాతీతమని, పగోడికి కూడా ఈ పరిస్థితి రావద్దంటున్నారు. ఇక పంత్ తర్వాత అశ్విన్ క్రీజులోకి రాగా.. జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.
అంతకు ముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(29), మయాంక్ అగర్వాల్(33) త్వరగా ఔటైనా.. తెలుగు క్రికెటర్ హనుమ విహారీ(58) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఆ తర్వాత జడేజాతో పంత్.. 6వ వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించడంతో భారత్ స్కోర్ 350 మార్క్ ధాటింది. క్రీజులో జడేజా(45 బ్యాటింగ్), అశ్విన్(10 బ్యాటింగ్) ఉన్నారు.