ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక మహిళల జట్టుతో మూడో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు.
తిరువనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ రేణుకా సింగ్(4/21).. స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(3/18) రఫ్ఫాడించడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులే చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో హాసిని పెరెరా(25), ఇమెషా దులని(27), కవిషా దిల్‌హరి(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ చమరి ఆటపట్టు(3)ను దీప్తి శర్మ ఔట్ చేయగా.. దూకుడుగా ఆడిన హాసిని పెరారా(25)ను రేణుకా సింగ్ ఔట్ చేసింది. హర్షిత సమరవిక్రమ(2)ను రిటర్న్ క్యాచ్‌తో రేణుక సింగ్ పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేలో శ్రీలంక 3 వికెట్లకు 32 పరుగులే చేసింది.

ఆ తర్వాత భారత బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇమెషా దులని(27), నిలక్షిక సిల్వా ఆచితూచి ఆడారు. సిల్వా(4)ను రేణుక సింగ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. దూకుడుగా ఆడిన కవిషా దిల్‌హరి(20)ని దీప్తి శర్మ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ పరిస్థితుల్లో కౌషిని(19 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మల్షా శెహాని(5)ని దీప్తి శర్మ క్లీన్ బౌల్డ్ చేసింది.
వరుసగా మూడో టీ20లోనూ శ్రీలంక బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో శ్రీచరణి విఫలమైంది. ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 11 పరుగులివ్వడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆమెకు మరోసారి బౌలింగ్ ఇవ్వలేదు.