
న్యూఢిల్లీ: కొత్త ఏడాది సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌ల్లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశం దక్కలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విఫలమవుతున్న రిషభ్ పంత్‌పై వేటు వేసిన బీసీసీఐ.. డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించింది. ఈ రెండు సిరీస్‌లకు సంబంధించిన వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
ఊహించినట్టుగానే పొట్టి ఫార్మాట్‌లో డాషింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా సూర్యకుమార్ వ్యవహరిస్తాడు. వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. స్వదేశంలో వచ్చేనెల 3 నుంచి 7 వరకు టీ20లు.. 10 నుంచి 15 వరకు వన్డే సిరీస్ జరుగుతాయి. గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్ వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే తొలిసారిగా యువ పేసర్లు శివమ్ మావి, ముకేశ్ కుమార్‌లకు టీ20ల్లో బెర్త్ దక్కింది. ఐపీఎల్ మినీ వేలంలో ఈ ఇద్దరికీ భారీ ధర పలికిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ పర్యటనలో విఫలమైన వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై సెలెక్టర్లు వేటు వేసారు. అంతేకాకుండా వన్డేల్లో రాహుల్‌కు కాకుండా హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. ఇక కుల్దీప్, అక్షర్, చాహల్, సుందర్ రూపంలో నలుగురు స్పిన్నర్లుండగా.. మహమ్మద్ షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్ష్‌దీప్ పేస్ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రతీ సిరీస్‌లో రిషభ్ పంత్‌కు అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. ఈ సిరీస్‌లకు మాత్రం పక్కనపెట్టింది.
అయితే పంత్‌ను పక్కనపెట్టడానికి అతను మొకాలి గాయంతో బాధపడుతుండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. చాలా రోజులుగా మొకాలి గాయంతో బాధపడుతున్నా.. పంత్ మొండిగా జట్టులో కొనసాగాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ గాయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ మెడికల్ టీమ్.. అతన్ని ఎన్‌సీఏలో చేరమని సూచించింది. జనవర్ 3 నుంచి 15 రోజుల వరకు రిషభ్ పంత్ మొకాలికి స్ట్రెంగ్తింగ్ సెషన్ నిర్వహించనున్నారు. ఈ గాయం విషయాన్ని చాలా రోజులుగా దాచిన పంత్.. మొండిగా ఆడి విఫలమయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.