
బెంగళూరు: వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న డే/నైట్ టెస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్, గత మ్యాచ్ సెంచరీ హీరో రవీంద్ర జడేజా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అతను అన్‌ఫిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే గాయం నుంచి కోలుకొని శ్రీలంకతో మ్యాచ్‌లకు రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. మొహాలీ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన జడేజా(175 నాటౌట్).. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. ఈ పెర్ఫామెన్స్‌తో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్స్ జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు.
అయితే బెంగళూరు వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్ట్‌కు జడేజా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న అతను శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదని దైనిక్ జాగరన్ అనే దినపత్రిక పేర్కొంది. కేవలం చిన్న చిన్న వార్మప్‌లు చేసిన జడేజా అసౌకర్యంగా కనిపించాడని తెలిపింది. అయితే జడేజా ఫిట్‌నెస్‌పై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ.. ఏదైనా సమస్య ఉంటే మాత్రం టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
భవిష్యత్తు టోర్నీలు, టీ20 ప్రపంచకప్ దృష్ట్యా జడేజాను కాపాడుకునేందుకే టీమ్‌మేనేజ్‌మెంట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరు టెస్ట్‌కు జడేజాకు ఏ చిన్న సమస్య ఉన్నా అతనికి విశ్రాంతినిస్తోంది. ఒకవేళ ఫిట్‌గా ఉంటే మాత్రం అతను బరిలోకి దిగుతాడు. జడేజా దూరమైతే అతని స్థానంలో.. ఇటీవలే గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ రీఎంట్రీ ఇస్తాడు. అప్పుడు మహమ్మద్ సిరాజ్‌కు లైన్ క్లియర్ అవుతుంది. జడేజా ఆడితే మాత్రం అక్షర్, సిరాజ్‌లో ఒకరికి చోటు దక్కుతుంది. అక్షర్ పటేల్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి.
ఇక జడేజా గాయంపై ఈ రోజు రోహిత్ శర్మతో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో క్లారిటీ రానుంది. సెకండ్ టెస్ట్ నేపథ్యంలో రోహిత్ ఇవాళ మీడియాతో మాట్లాడనున్నాడు. టీమ్ స్ట్రాటజీస్, టీమ్ కాంబినేషన్స్ వివరాలను వెల్లడించనున్నాడు.