
తిరువనంతరపురం: వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో సమష్టిగా చెలరేగిన టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన ఏకైక జట్టుగా భారత్ చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 నాటౌట్), శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116) శతక్కొట్టగా... కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(38) పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీయగా.. కరుణరత్నే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(4/32) ధాటికి 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. నువనిందు ఫెర్నాండో(19), డసన్ షనక(11), కసున్ రజిత(13 నాటౌట్) మినహా ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా..మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అషెన్ బండార గాయం కారణంగా బ్యాటింగ్ రాలేదు.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో 317 పరుగుల భారీ తేడాతో ఓ జట్టు గెలవడం ఇదే తొలిసారి. గతంలో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో గెలవగా.. ఆ రికార్డును తాజాగా భారత్ అధిగమించింది. భారీ విజయంతో భారత్ చరిత్ర సృష్టిస్తే.. శ్రీలంక మాత్రం ఘోర పరాజయంతో చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంకకు సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. తన వరుస ఓవర్లలో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో(1), కుశాల్ మెండిస్(4)లను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే చరిత్ అసలంక(1)ను షమీ ఔట్ చేయగా.. నువనిందుఫెర్నాండో(19), వానిందు హసరంగాలను స్టన్నింగ్ డెలివరీలతో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కరుణ రత్నేను సిరాజ్ స్మార్ట్‌గా రనౌట్ చేయగా.. కుల్దీప్ యాదవ్ డసన్ షనక(11) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే దునిత్ వెల్లలగే(3)ను షమీ క్యాచ్ ఔట్ చేయడంతో 51 పరుగులకే శ్రీలంక 8 వికెట్లు కోల్పోయింది. లాహిరు కుమార, కసున్ రజితా కాసేపు ఆడినా.. కుల్దీప్ వారి పోరాటానికి తెరదించాడు. లాహిరు కుమారాను క్లీన్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫీల్డింగ్ చేస్తూ దారుణంగా గాయపడ్డ అషేన్ బండారా బ్యాటింగ్‌కు రాలేదు.