కొలంబో: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన రాహుల్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. ఆసియాకప్ 2023లో భాగంగా వరల్డ్ నెంబర్ వన్ టీమ్ పాకిస్థాన్‌తో సోమవారం ముగిసిన మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లను చెడుగుడు ఆడాడు.
శ్రీలంకతో బుధవారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై ఇషాన్ కిషన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్యాటింగ్‌లో సత్తా చాటిన కేఎల్ రాహుల్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ప్రమోషన్ ఇచ్చింది. వికెట్ కీపర్‌గానూ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. కళ్లు చెదిరే క్యాచ్‌లతో పాటు సూపర్ స్టంపింగ్‌లతో ఆకట్టుకున్నాడు.

అంతటితో ఆగకుండా బౌలర్లకు కీలక సలహాలు ఇస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లకు ఉచ్చులు బిగిస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హయాంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ జోడీ ఓ వెలుగు వెలిగింది. వికెట్ల వెనుకాల ఉన్న ధోనీ బ్యాటర్ల కదిలికలను పసిగట్టి ఈ ఇద్దరికీ సలహాలు ఇచ్చేవాడు. అతని సూచనలకు తగ్గట్లు బౌలింగ్ చేసి వికెట్లు రాబట్టేవారు.
తాజాగా కేఎల్ రాహుల్ కూడా అలానే సలహాలు ఇస్తూ ధోనీని తలపించాడు. రాహుల్ ఇచ్చిన సలహాలతో బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్.. సమర విక్రమార్కను స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌కు ముందు కుల్దీప్ యాదవ్‌తో రాహుల్ చర్చించగా.. మూడో బంతికి సమరవిక్రమార్క స్టంపౌటయ్యాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత రవీంద్ర జడేజాకు సైతం పలు సూచనలు చేశాడు. నెమ్మదిగా బౌలింగ్ చేయాలని, వేగంగా బౌలింగ్ బంతి టర్న్ అవ్వడం లేదని చెప్పాడు. రాహుల్ సూచనలతో మూడు బంతులను నెమ్మదిగా వేయడంతో శ్రీలంక బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వేగంగా వేయడంతో శ్రీలంక బ్యాటర్ బౌండరీకి తరలించాడు. దాంతో రాహుల్ సూచనలు కీలకమనే విషయం అర్థమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్(26, సిరాజ్(5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40), చరిత్ అసలంక (4/14) భారత్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు.