
బెంగళూరు: సొంతగడ్డపై టీమిండియా మరో భారీ విజయాన్నందుకుంది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన గులాబీ టెస్ట్‌లో సమష్టిగా రాణించిన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 447 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 208 పరుగులకే కుప్పకూలింది. లంక్ కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(174 బంతుల్లో 15 ఫోర్లతో 107) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది.
కుశాల్ మెండీస్(60 బంతుల్లో 8 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు రెండు, రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. రెండున్నర రోజుల్లో గులాబీ టెస్ట్ ముగియడం విశేషం. ఇక సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం కావడం గమనార్హం.
ఇక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు.
అనంతరం శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా(5/24) ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. దాంతో భారత్‌కు 143 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ కూడా మరో హాఫ్ సెంచరీ బాదడంతో భారత్ 303/9 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)
భారత్ రెండో ఇన్నింగ్స్ 303/9 డిక్లెర్డ్ (రిషభ్ పంత్ 50, శ్రేయస్ అయ్యర్ 67)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 208 ఆలౌట్( దిముత్ కరుణ రత్నే 107, కుశాల్ మెండీస్ 54)