IND vs SL: పాపం బుమ్రా.. బౌల్డ్ అనుకొని సంబరపడితే నో బాల్ అయ్యే! (వీడియో)

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చేసిన ఘోర తప్పిదం అభిమానులతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇక శ్రీలంక బ్యాట్స్‌మన్ పాతుమ్ నిస్సాంకకు మాత్రం లైఫ్ ఇచ్చింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా వేసిన 32వ ఓవర్ మూడో బంతి నిస్సాంక మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టేసింది. బుమ్రా వేసిన స్లోయర్ ఇన్ స్వింగ్ డెలివరీని అంచనా వేయడంలో నిస్సాంక విఫలమవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
నోబాల్ కావడంతో..
దాంతో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. నిస్సాంక కూడా తాను ఔటని భావించి నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నోబాల్‌గా గుర్తించిన టీవీ అంపైర్.. బ్రజర్ మోగించడంతో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. టీవీ రిప్లేలో కూడా అది స్పష్టమైన నోబాల్‌గా తేలింది. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా తీవ్ర అసహనానికి గురయ్యాడు. రోహిత్ శర్మ సైతం బుమ్రా తప్పిదంపై కస్సుమన్నాడు. ఇక బుమ్రా తల బాదుకుంటూ బంతి వేయడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో..
అయితే ఇలా బుమ్రా నోబాల్ వేసి వికెట్ తీయడం ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా అతన్ని ఈ సమస్య వెంటాడుతోంది. బుమ్రా చేసిన తప్పిదంతోనే టీమిండియా ఒక ఐసీసీ ట్రోఫీని కూడా కోల్పోయింది. పాకిస్థాన్‌తో జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా బుమ్రా ఇలాంటి తప్పిదం చేసి భారత్‌కు తీవ్ర నష్టం కలిగించాడు. అతని బౌలింగ్‌లో ఔటైన ఫకార్ జమాన్.. ఇలానే నోబాల్‌తో బచాయించాడు. ఈ అవకాశంతో అతను భారీ శతకంతో చెలరేగాడు. టీమిండియా ముందు భారీ స్కోర్ నమోదు అవ్వడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

టెస్ట్‌ల్లో మూడో సారి..
టెస్ట్‌ల్లో మాత్రం బుమ్రా ఒక ఆటగాడిని నో బాల్ వేసి క్లీన్‌బౌల్డ్ చేయడం ఇది మూడోసారి. ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ మార్ష్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఓలి రాబినసన్‌లు కూడా ఇదే తరహాలో బమ్రా నుంచి తప్పించుకున్నారు. తాజాగా నిస్సాంకా మూడో ఆటగాడిగా నిలిచాడు. దీంతో బుమ్రాకు నో బాల్స్ బెడద ఎక్కువైందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

పట్టుబిగించిన భారత్..
రవీంద్ర జడేజా ( 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 175 నాటౌట్) భారీ శతకంతో ఈ మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగించింది. జడేజా అజేయ శతకానికి తోడు రవిచంద్రన్ అశ్విన్(82 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 574/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసింది. భారత్ కన్నా ఆ జట్టు ఇంకా 466 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. సెంచరీ హీరో జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా చెరొక వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications