IND vs SL: చెలరేగిన భువీ.. చేతులెత్తేసిన శ్రీలంక.. గబ్బర్ సేన ఘన విజయం!

కొలంబో: బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత అద్భుత విజయాన్నందుకుంది. మరోసారి శ్రీలంక బలహీనతపై దెబ్బకొట్టిన గబ్బర్ సేన 38 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50)హాఫ్ సెంచరీతో రాణించగా.. శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం శ్రీలంక 18.3 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. చరిత్ అసలంక(44), అవిష్కా ఫెర్నాండో(26) మినహా అంతా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్ (4/22) నాలుగు వికెట్లతో లంక పతనాన్నిశాసించగా.. దీపక్ చాహర్(2/24) రెండు, వరుణ్ చక్రవర్తీ(1/28), యుజ్వేంద్ర చాహల్(1/19), హార్దిక్ పాండ్యా(1/17), కృనాల్ పాండ్యా(1/16)తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం జరగనుంది.

శుభారంభం లేదు..
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మినోద్ భానుక(10) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో ఆడపా దడపా బౌండరీలు బాదడంతో శ్రీలంక పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 46 రన్స్ చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ శిఖర్ ధావన్ యుజ్వేంద్ర చాహల్‌ను బరిలోకి దింపి ఫలితం రాబట్టాడు. తన తొలి ఓవర్ రెండో బంతికే ధనుంజయ డిసిల్వా(9)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే అవిష్కా ఫెర్నాండో(26) శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అసలంక మెరుపులు..
ఇక క్రీజులోకి వచ్చిన చరిత్ అసలంక భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన అసలంక చాహల్ ఓవర్‌లో బౌండరీ సాధించాడు. మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ వేసిన 12వ ఓవర్‌లో మరో భారీ సిక్సర్ బాదిన అసలంక..తన మరుసటి ఓవర్‌లో సిక్స్, ఫోర్‌తో 14 రన్స్ పిండుకున్నాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతూ.. ప్రమాదకరంగా మారిన అసలంకను దీపక్ చాహర్ పెవిలియన్ చేర్చాడు. అతను వేసిన 16వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అసలంక డీప్ మిడ్‌వికెట్‌లో పృథ్వీ షాకు చిక్కాడు. అదే ఓవర్‌లో హసరంగా కూడా ఔటవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.

చెలరేగిన భువీ..
భువీ బౌలింగ్‌లో కెప్టెన్ డసన్ షనక భారీ సిక్సర్‌తో ఆందోళన పెట్టినా.. మరో ఎండ్‌లోని కరుణరత్నేను భువీ క్లీన్ బౌల్డ్ ఔట్ చేశాడు. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో డసన్ షనక స్టంపౌటవ్వడంతో శ్రీలంక ఆశలు సన్నగిల్లాయి. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 40 పరుగులు అవసరమవ్వగా.. 19వ ఓవర్ వేసిన భువీ తొలి మూడు బంతుల్లోనే ఇసురు ఉడానా(1), చమీరా(1)లను పెవిలియన్ చేర్చాడంతో భారత విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications