కొలంబో: ఆసియాకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ విజయంతో శ్రీలంక జైత్రయాత్రకు భారత్ బ్రేక్ వేసింది. వన్డేల్లో వరుసగా 13 మ్యాచ్‌ల తర్వాత శ్రీలంక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది.
రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్(26, సిరాజ్(5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.

లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (4/14) నాలుగు వికెట్లు తీసాడు. మహీశ్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా( 66 బంతుల్లో 5 ఫోర్లతో 41), దునిత్ వెల్లలాగే(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో టీమిండియా ఆసియాకప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడినా ఫైనల్ బెర్త్‌కు వచ్చే డోకా లేదు.

బూమ్ బూమ్ బుమ్రా..
214 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు దిగిన శ్రీలంకకు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఓపెనర్ పాతుమ్ నిస్సంక(6)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్ మూడు బౌండరీలతో జోరు కనబర్చగా.. బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్యాచ్ ఔట్ చేశాడు.
ఆ వెంటనే మరో ఓపెనర్ దిముత్ కరుణ రత్నే(2) మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సదీర సమర విక్రమార్క, చరిత్ అసలంక ఆచితూచి ఆడటంతో శ్రీలంక పవర్ ప్లేలో మూడు వికెట్లకు 39 పరుగులే చేసింది.

పవర్ ప్లే అనంతరం విక్రమార్క, చరిత్ అసలంక ఆచితూచి ఆడారు. 43 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. వరుస ఓవర్లలో విక్రమార్క(17), చరిత్ అసలంక(22)లను పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డసన్ షనక(9)ను జడేజా ఔట్ చేయడంతో శ్రీలంక 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
మలుపు తిప్పిన జడేజా..
ఈ పరిస్థితుల్లో ధనంజయ డిసిల్వా, వెల్లలాగే జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 63 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయం దిశగా నడిపించారు. కానీ జడేజా స్టన్నింగ్ డెలివరీతో డిసిల్వాను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహీశ్ తీక్షణ(2)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేయగా.. కాసున్ రజిత(1), మతీశ పతీరణ(0)ను కుల్దీప్ పెవిలియన్ చేర్చి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.