సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. శ్రీలంక పర్యటనలో విఫలమవుతున్నాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం నేరుగా శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న కోహ్లీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.
ఈ రెండు మ్యాచ్‌ల్లో స్పిన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 38 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీతో పాటు ఇతర మిడిలార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో ఈ సిరీస్‌లో టీమిండియా విజయాన్నందుకోలేకపోయింది. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన బసిత్ అలీ.. కోహ్లీ వైఫల్యంపై స్పందించాడు.

'వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అయిన విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు ఇలా ఔటయ్యారంటే ఓ అర్థం ఉంది. కానీ గొప్ప బ్యాటర్ అయిన కోహ్లీ ఇలా ఔటవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. అతని వైఫల్యం చూస్తుంటే కోహ్లీకి సరైన ప్రాక్టీస్ లేదనిపిస్తోంది. ప్రస్తుతం భారత బ్యాటింగ్ చూస్తుంటే ఈ జట్టేనా ప్రపంచ క్రికెట్‌ను శాసించిందనే అనుమానం కలుగుతోంది.
శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు కూడా సరైన ప్రాక్టీస్ లేదనిపిస్తోంది. ఎలాంటి సన్నదత లేకుండా ఈ సిరీస్ ఆడుతున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఇలాంటి ప్రదర్శనలతో శ్రేయస్ అయ్యర్ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. రిషభ్ పంత్, రింకూ సింగ్, రియాన్ పరాగ్‌లను జట్టులోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తోంది. భారత్‌కు ప్రతీ వన్డే సిరీస్ ముఖ్యమే. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కొందరి ఆటగాళ్లను ప్రయోగించనున్నాడు.'అని బసిత్ అలీ చెప్పుకొచ్చాడు.
కొలంబో వేదికగా నాలుగు శతకాలు సాధించిన కోహ్లీ.. తాజా సిరీస్‌లో మాత్రం తడబడుతున్నాడు. బుధవారం ఇరు జట్ల మధ్య ఇదే వేదికపై చివరి వన్డే జరగనుంది.