కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ మ్యాచ్‌లో టీమిండియా తడబడుతోంది. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే 170 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాకిస్థాన్‌పై 229 పరుగుల భారీ విజయాన్నందుకున్న టీమిండియా 15 గంటల వ్యవధిలోనే మరో మ్యాచ్‌కు సిద్దమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. శ్రీలంక బౌలర్లను చెడుగుడు ఆడారు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది.

అనంతరం శ్రీలంక కెప్టెన్ స్పిన్నర్లను బరిలోకి దించగా.. భారత ఓపెనర్లు అదే జోరును కొనసాగించారు. పాకిస్థాన్‌తో ఆడిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ కొనసాగుతుండటంతో క్రాక్స్ ఏర్పడ్డాయి. ఈ పగుళ్లను శ్రీలంక స్పిన్నర్లు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా దునిత్ వెల్లలాగే దుమ్మురేపాడు. తన స్పిన్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. టాప్-4 బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. తద్వార భారత్ టాప్-4 బ్యాటర్లను అరెస్ట్ చేసిన రెండో బౌలర్‌గా వెల్లలాగే చరిత్రకెక్కాడు.
హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ(53)తో పాటు శుభ్‌మన్ గిల్(19), విరాట్ కోహ్లీ(3), కేఎల్ రాహుల్(39)లను పెవిలియన్ చేర్చాడు. ముందుగా శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లోనే క్యాచ్ ఔటవ్వగా.. రోహిత్ శర్మను అతనే క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో టీమిండియా 11 పరుగుల వ్యవధిలోనే కీలకంగా మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో ఇషాన్ కిషన్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 63 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈజోడీని దునిత్ వెల్లలాగేనే పెవిలియన్ చేర్చాడు. పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో బౌలింగ్ చేసి క్యాచ్ ఔట్ చేశాడు. వెల్లలాగే ఉచ్చును గ్రహించలేకపోయిన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ కిషన్(39) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు.
కానీ చరిత్ అసలంక బౌలింగ్‌లో దునిత్ వెల్లలాగే సూపర్ క్యాచ్‌కు అతను పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన జడేజా.. హార్దిక్‌తో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు.